
కామారెడ్డి తహసీల్‌లో కనిపించని అధికారులు
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణ జనాభా లక్షకు పైగా ఉండడం, కామారెడ్డి మండల, గ్రామాలకు కలిపి ఒకే తహసీల్ కార్యాలయం సేవలు అందించాల్సి ఉండగా అసలు సిబ్బందే కుర్చీల్లో కనిపించడం లేదు. మండలంలోని గ్రామాల్లో రెవెన్యూ సభలుంటే తహసీల్ ఆఫీసుల్లో అటెండర్ తప్ప ఏ ఉద్యోగి ఉండటం లేదు. శుక్రవారం భూమి రిజిస్ట్రేషన్ కోసమని లింగాపూర్‌కు చెందిన పిల్లమారి రామవ్వ, అవుసుల బ్రహ్మంలతో పాటు పలువురు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉదయం 10.30కు స్లాట్ బుక్ కాగా అమ్మకం, కొనుగోలు దారులు, వారి బంధువులు, సాక్షులు తహసీల్ ఆఫీసుకు చేరుకోగా అక్కడి సిబ్బంది లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. మధ్యాహ్నం ఒంటి గంట అవుతున్నా ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో లింగాపూర్ చెందిన బ్రహ్మం ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్ గది నుంచి వచ్చిన ఓ కాంట్రాక్ట్ సిబ్బంది ధరణి సిబ్బందికి జీతాలు రానందున కలెక్టర్ ఆఫీసుకు వెళ్లారని, తహసీల్దార్ సైతం అక్కడికే వెళ్లారని బదులిచ్చారు. మరి స్లాట్ సంగతి అంటే తనకు తెలియదన్నారు. ఇలా తహసీల్ ఆఫీసులో ప్రతి నిత్యం ఇలా బాధ్యత లేకుండా సిబ్బంది పనిచేస్తున్నారని అక్కడికి వచ్చిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రేషన్ కార్డు విషయమై వారం రోజుల నుంచి తిరుగుతున్న సరైన సమాధానం చెప్పేవారు లేరని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై వివరణ కోరేందుకు తహసీల్దార్ జనార్దన్‌కు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
తహసీల్దార్ లేకుంటే సిబ్బంది ఖాళీ
గత కొన్ని నెలలుగా ఇదే తంతు