
నేడు లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా భారీ జన సమీకరణపై నేతలు దృష్టి సారించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యేలా చూస్తున్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేటీఆర్ పర్యటన ఇలా..
మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కామారెడ్డి మీదుగా లింగంపేటకు చేరుకుంటారని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అనంతరం లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి ఎల్లారెడ్డికి వెళ్లి పార్టీ నాయకుడి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. తర్వాత నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి వెళ్లి చేరుకుని, అక్కడ భోజనం చేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
సభను విజయవంతం చేయాలి
కామారెడ్డి టౌన్: లింగంపేటలో శుక్రవారం ని ర్వహించే బీఆర్‌ఎస్ ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నర్సన్నపల్లి వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలికి అక్కడి నుంచి వాహనాల ర్యాలీతో లింగంపేట వరకు వెళ్తామని పేర్కొన్నారు.
సభకు హాజరుకానున్న
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
భారీ జన సమీకరణపై
పార్టీ నేతల దృష్టి