
బైక్ చోరీల కేసులో నిందితుల అరెస్ట్
కామారెడ్డి క్రైం: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పీఎస్‌లో గురువారం ఎస్‌హెచ్‌వో నరహరి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన జంగం నగేష్ తన బైక్ చోరీకి గురైనట్లు ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గురువారం పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా రెండు బైక్‌లపై వచ్చిన ఇద్దరు యువకులు పోలీసులను చూసిపారిపోబోయారు. వారిని పట్టుకుని విచారించగా బైక్‌ల చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. జంగం నగేష్ బైక్‌తో పాటు కామారెడ్డిలోని ఉస్మాన్‌పుర, శ్రీరాంనగర్ కాలనీల్లో ఇదే తరహాలో మరికొన్ని బైక్ లను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. వారి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రాజారాం, సిబ్బందిని అభినందించారు.