అన్నదాతపై విత్తన భారం
మోర్తాడ్: జీలుగ సాగుతో భూసారం పెరుగుతుంది. అందుకే రైతన్నలు వీటిపై ఆసక్తి చూపుతారు. రాష్ట్ర ప్రభుత్వం జీలుగ విత్తనాలను రాయితీపై అందిస్తుంది. ఈ ఏడాది యాభై శాతం రాయితీపై విత్తనాలను సహకార సంఘాల ద్వారా విక్రయిస్తున్నా గతంలో కంటే ధర రెట్టింపు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీలుగ విత్తనాల సంచి పరిమాణం 30 కిలోలు ఉండగా గతంలో రాయితీ పోను రూ.1,116కు రైతులకు లభించింది. అంటే నాడు ఒక్కో సంచికి రూ.2,232 ఉండేది. ఇప్పుడు సంచి ధర రూ.4,275 ఉండగా 50 శాతం రాయితీపై రూ.2,137కు లభిస్తోంది. గతంలో కంటే రూ.1,021 ధర పెరిగిందని స్పష్టమవుతోంది.
విత్తనాల సేకరణలో ఇబ్బందితోనే..
జీలుగ విత్తనాల సేకరణలో ఇబ్బందులు కలుగడంతో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ యాజమాన్యం వెల్లడించింది. జీలుగ విత్తనాలు గతంలో మాదిరిగా తక్కువ ధరకు లభించి ఉంటే అటు రైతులపై, ఇటు ప్రభుత్వంపై భారం ఏర్పడేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించి జీలుగ విత్తనాల ధర పెంపుపై పునరాలోచన చేసి రైతులకు మేలు చేయాలని పలువురు కోరుతున్నారు.
రైతులకు భారమే...
జీలుగ విత్తనాల ధర పెంపుతో
రైతుల్లో ఆందోళన
గతంలో కంటే రెట్టింపు
ధరకు విక్రయం
విత్తనాల కొరతతోనే ఎక్కువ ధరకు
కొనుగోలు: విత్తనాభివృద్ధి సంస్థ
యాజమాన్యం
ఇబ్బంది పడుతున్న రైతులు
జీలుగ విత్తనాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి భారం ఏర్పడటమే కాకుండా రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది. జీలుగ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో వీటి సేకరణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ఖజానాకు ఆర్థిక భారం ఏర్పడింది. రాయితీ గతంలో మాదిరిగానే వర్తింప చేసినా ధర పెరగడం వల్ల రైతులపై భారం తప్పలేదని చెప్పవచ్చు.


