ప్రభుత్వంతో ఇక అమీతుమీ.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంతో ఇక అమీతుమీ..

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌

ఉద్యోగుల జేఏసీ

● రాజమహేంద్రవరంలో

గోదావరి మహా గర్జన సదస్సు

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని రాష్ట్ర జేఏసీ స్పష్టం చేసింది. సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో నవంబర్‌లో రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగులు అతి పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం స్థానిక రమణం శ్రీరాములు కల్యాణమండపంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ కాంతారావు అధ్యక్షతన గోదావరి మహా గర్జన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏమీ చేయలేదని, ఎంటీఎస్‌ హక్కును రద్దు చేసి అన్యాయం చేసిందని, రూ.7 వేలు, రూ.8 వేల వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులని చెబుతూ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని విమర్శించారు. ప్రశ్నిస్తాం అన్న పవన్‌ కల్యాణ్‌ గొంతు అధికారంలోకి రాగానే మూగబోయిందని, రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది కాంట్రాక్టు , అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీవన పరిస్థితులు ప్రభుత్వానికి కనపడట్లేదని మండిపడ్డారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ బి.కాంతారావు మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీలో తమ సమస్యలపై కనీస చర్చ కూడా జరగకపోవడం అన్యాయమన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కీలకంగా పని చేస్తున్న తమను విస్మరించటం సరికాదన్నారు. తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎంటీఎస్‌ ఇస్తామని, సంక్షేమ పథకాలు ఇస్తామని, రెగ్యులర్‌ చేస్తామని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆప్కాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మన హక్కులు అడుగుతుంటే ప్రభుత్వం ఉన్న హక్కులను తొలగిస్తోందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు డి.దయమణి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవట్లేదని, ఈ నేపథ్యంలో మనం ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ఉద్యమ ప్రణాళికను ప్రకటించారు. ఈ నెల 25న జిల్లా కలెక్టరేట్‌ల ముందు ధర్నా నవంబర్‌ 5న చలో విజయవాడ, అసెంబ్లీ సమావేశాల కాలంలో 3 రోజులు విజయవాడలో దీక్షలు, అసెంబ్లీకి పాదయాత్ర వంటి ఉద్యమ ప్రణాళికను ప్రకటించారు. అనంతరం వివిధ శాఖల సంఘాల రాష్ట్ర నాయకులు రవి ప్రకాష్‌, కల్యాణి, గంగాధర్‌, గాంధీ, శశికళ, రాజశేఖర్‌, సురేష్‌, జె.వెంకటేశ్వరావు, సుధీర్‌, బి.పవన్‌, ఎం.సుందర్‌ బాబు, బి.పూర్ణిమారాజు తదితరులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement