చంద్రబాబును నమ్మి మోసపోయాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లను కొనసాగిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు జీతం ఇస్తామని బాబు నమ్మించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్లీ వస్తుందని ఆశపడ్డాం. అధికారంలోకి రాగానే వలంటీర్ల ఊసే ఎత్తడం లేదు. రెండున్నరేళ్లుగా అడుగుతూనే ఉన్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం.
– ఐతి సింధూప్రియ, మాజీ వలంటీర్, పెద్దాపురం
అన్యాయంగా తొలగించారు
ఎన్నికల్లో కళ్లబొల్లి మాటలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు నమ్మించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీరు వ్యవస్థను పూర్తి రద్దు చేశారు. ప్రజలకు విశేష సేవలు అందించిన మమ్మల్ని అన్యాయంగా తొలగించారు. నేను చేసిన సేవలకు ఒక పర్యాయం సేవారత్న అవార్డుగా రూ.20 వేలు, మూడు పర్యాయాలు సేవా మిత్ర అవార్డులు రూ.10 వేల చొప్పున అప్పటి ప్రభుత్వం నుంచి పొందాను. ప్రస్తుతం నిరుద్యోగిగా మిగిలిపోయాను.
– ఆకుల ఉమామహేష్, మాజీ వలంటీర్, సామర్లకోట


