కరువు రక్కసి కాటేస్తున్నా.. కర్షకులపై
కనికరం కరువైంది.. కష్టకాలంలో అన్నదాతలను ఆదుకోవలసిన కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. కరువు మండలాల ప్రకటనలో సైతం రైతులపై చిత్తశుద్ధి కరువైంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు తలెత్తాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, ఆరింటిని మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం చూస్తే కూటమి సర్కారు రైతులకు ఏ మేరకు అండగా నిలబడుతోందో అర్థమవుతోంది. రైతులకు రాయితీలు ఎగ్గొట్టడమే ప్రభుత్వ ఉద్దేశమని రైతుల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీరు లేక పంటల సాగుకు రైతులు ఆకాశం వైపు చూస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతులను ఆదుకునేందుకు ముందుకురాలేదు. పైగా తీరిగ్గా స్పందించింది. జిల్లా వ్యాప్తంగా ఆరు మండలాల్లో (తుని, తొండంగి, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, పెద్దాపురం) కరువు పరిస్థితులు ఉన్నట్టు ప్రకటించింది. ఖరీఫ్ సీజన్‌లో జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 30 వరకు ఉన్న లోటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని కరువు మండలాల ప్రకటన చేసింది. మూడు మాసాల్లో ఆయా మండలాల్లో సాధారణం కంటే 53 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వర్షపాతం, సాగు విస్తీర్ణం, భూమిలో తేమ, భూగర్భ జలాలు, వృక్ష సంపద, జలాశయ నిల్వల వంటి వనరుల ఆధారంగా మండలాలను ప్రకటించినట్టు వెల్లడించింది.
13కు గాను 6 మాత్రమేనా?
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వర్షపాత వివరాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాలో 13 మండలాల్లో దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నట్టు శాటిలైట్ గణాంకాల ఆధారంగా జిల్లా వ్యవసాయ శాఖకు నివేదిక పంపింది. ఆ నివేదిక మేరకు కాజులూరు, తాళ్లరేవు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పిఠాపురం, గొల్లప్రోలు, కిర్లంపూడి, తుని, తొండంగి, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, పెద్దాపురం మండలాలను ప్రాథమికంగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వివిధ సాగునీటి వనరులపై అధ్యయనం చేసి అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వాటిలో కేవలం ఆరు మండలాలనే ప్రకటించడంపై రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొలంలో పచ్చగడ్డి ఉన్నా.. శాటిలైట్‌కు పంట సాగు చేసిన విధంగా కనిపిస్తుందని, అధికారులు ప్రత్యేకంగా పరిశీలన చేయాలన్న డిమాండ్ వస్తోంది.
తీవ్రతను కప్పిపుచ్చేందుకే
కాలయాపన..
ఈ ఏడాది ఖరీఫ్‌లో లోటు వర్షపాతం విషయం ఆగస్టులోనే స్పష్టమైంది. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 19 వరకు 580.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 321 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 44.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరువు అంచనాకు తీసుకున్న వర్షపాతం లెక్కలు ఆగస్టు 31తో ముగిసినా.. ప్రకటించేందుకు నెల రోజుల సమయం తీసుకోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కరువు తీవ్రతను కప్పిపుచ్చేందుకే అక్టోబర్ వరకు కాలయాపన చేసిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏలేరు ఉన్నా..
కాకినాడ జిల్లాలో ఏలేరు ఆయకట్టుకు కొంత నీటి వెసులుబాటు ఉన్నా.. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి, తుని పరిసర మెట్ట ప్రాంతాలు వర్షాలపై ఆధారపడినవి. పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట పరిసరాల్లోనూ బోరు ఆధారిత సాగుకు వర్షం ఆవశ్యకత ఉంది.
పంపా ఆయకట్టు తీసికట్టు
పంపా ఆయకట్టు పరిధిలోని తొండంగి మండలంలో ఖరీఫ్ వరి 3353 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది. రైతులు పోలవరం నీటిపై ఆశలు పెట్టుకోగా, ప్రభుత్వం నీరివ్వకపోవడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఇటీవల వర్షాలు కురిసినా.. నీటి లభ్యత ఉన్నా.. విడుదలపై రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఈ ఏడాది పంపా ఆయకట్టు రైతులు వరి నాట్లు వేయలేదు.
కరువు మండలాల్లో
పంట సాగు ఇలా...
మండలం సాగు విస్తీర్ణం సాగైన విస్తీర్ణం
(హెక్టార్లలో) (హెక్టార్లలో)
తుని 3,428 690
శంఖవరం 1,030 99
ఏలేశ్వరం 2,785 2,553
ప్రత్తిపాడు 4,446 1,583
తొండంగి 5,176 1,547
పెద్దాపురం 4,595 4,074
సాయం సంగతేంటో?
కరువు మండలాలుగా ప్రకటిస్తే ఆయా మండలాల్లోని రైతులకు విపత్తుల సహాయ నిధి నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం కలిగితే పరిహారం చెల్లించాలి. రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలి. ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలి. నర్సరీ దశలో పంట పాడైపోతే రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంతవరకు సాయం ప్రకటన ప్రభుత్వం నుంచి రాకపోవడంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన కరువు మండలాల జీవోలో సైతం రైతులకు ఊరటనిచ్చే అంశం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఎంత, ఎప్పుడిస్తారు, పంట నష్టం అంచనాలు ఏమిటి, ఎప్పటిలోగా రుణాలు రీషెడ్యూల్ చేస్తారు, వడ్డీ మాఫీ, కేంద్ర సాయం కోసం నివేదిక, పశుగ్రాసం పరిస్థితేమిటన్న వాటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైంది.
కరువు మండలాల
ప్రకటనలోనూ ‘పచ్చ’పాతం
జిల్లాలోని 13 మండలాల్లో
దుర్భిక్ష పరిస్థితులు ఉన్నట్టు
వ్యవసాయ శాఖ నివేదిక
కేవలం 6 మండలాలనే
గుర్తించిన ప్రభుత్వం
మిగిలిన మండలాల
పరిస్థితేంటని ప్రశ్నిస్తున్న కర్షకులు
ప్రభుత్వ రాయితీలు ఎగ్గొట్టేందుకే
అంటున్న రైతులు


