దిగొచ్చినీరండోయ్‌! | - | Sakshi
Sakshi News home page

దిగొచ్చినీరండోయ్‌!

Jul 30 2026 12:39 AM | Updated on Jul 30 2026 12:39 AM

పిఠాపురం: చివరికి ప్రభుత్వం దిగొచ్చింది.. పుడమి పుత్రుల కన్నీళ్లు తుడిచేందుకు వైఎస్సార్‌ సీపీ చేపట్టిన పోరాటానికి ఫలితం దక్కింది.. నీరు లేక ఎండుతున్న నారుమళ్లను చూసి, వెంటనే రైతులతో కలసి ఆందోళన బాట పట్టింది. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, పంటలకు పూర్తి స్థాయిలో నీరిచ్చే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించింది. అవసరమైతే ‘చలో ఏలేరు’ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరిచింది. పంటలకు నీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వంగా గీత ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఫలించింది.

గత నెల రోజుల ముందే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు చివరి ఆయకట్టుకు నీరిస్తామని.. నారుమళ్లు సిద్ధం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. దీంతో అప్పులు చేసి రైతులు నారుమళ్లు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో సాగునీరందక నారుమళ్లు ఎండిపోతుండడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. చివరికి హామీ ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో రైతులంతా కలసి మాజీ ఎంపీ వంగా గీత వద్దకు వెళ్లి తమ సమస్యను విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన ఆమె ఎండుతున్న నారుమళ్లను పరిశీలించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు మల్లవరం రోడ్డులోని కొత్త కాలువను పరిశీలించారు. అడుగంటిన కొత్త కాలువలోకి దిగి రైతులతో కలసి నిరసన తెలిపారు. పొలాలకు నీరు సరఫరా చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వంగా గీత ఆరోపించారు. ఒకవైపు వ్యవసాయ అధికారులు నెల రోజుల నుంచి నారుమడులు వేయాలని ప్రచారం చేశారని, తీరా నాడుమడులు వేసిన తర్వాత నీరు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులంటే అంత చులకనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని గుర్తు చేశారు. కనీసం నారుమడులు తడపడానికి కూడా నీరు లేకపోయిందని వాపోయారు. పశువులు తాగడానికి కూడా నీరు లేక కాలువలు అడుగంటాయన్నారు. రైతులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రైతులతో కలసి చలో ఏలేరు కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ వెంటనే స్పందించాలని, పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని కోరారు. దీంతో కదిలిన అధికారులు ఏలేరులో నీటి నిల్వలు సరిపడా లేకపోవడంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి రోజూ వెయ్యి క్యూసెక్కుల సాగు నీరందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

వంతుల వారీగా నీరు విడుదల

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రైతులకు సాగునీరు సక్రమంగా, సమానంగా అందేలా వంతుల వారీగా ఏలేరు నీరు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలేరు నుంచి ప్రతి రోజు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామన్నారు. వంతుల వారీ విధానం క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు, జల వనరుల, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఖరీఫ్‌కు నీరందించాలని

వైఎస్సార్‌ సీపీ ఆందోళన

వంగా గీత సారథ్యంలో పోరాటం

చివరికి దిగివచ్చిన ప్రభుత్వం

సాగు నీరందించేందుకు నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement