శ్రీపాద శ్రీవల్లభా... శిరసా నమామి | - | Sakshi
Sakshi News home page

శ్రీపాద శ్రీవల్లభా... శిరసా నమామి

Jul 30 2026 12:39 AM | Updated on Jul 30 2026 12:39 AM

పిఠాపురం: దత్తాత్రేయుని అవతారాల్లో ఒకటైన శ్రీపాదుని జన్మ స్థలమైన పిఠాపురంలో గురుపూజోత్సవం కనుల పండువగా జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి బారులుతీరి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాదగయ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

జగన్‌ను అనుసరిస్తూ

చంద్రబాబు పాలన

కాకినాడ రూరల్‌: ఏపీ రాజధాని అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలను అమలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌ చేసిన ‘మావిగన్‌’ రాజధాని ప్రతిపాదన అసలు విలువేంటో ఇప్పుడు చంద్రబాబుకు అర్థం అవుతుందన్నారు. ఇన్నాళ్లు అమరావతి అని పట్టుకుని వేలాడిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధానిగా అభివృద్ధి చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారన్నారు. మచిలీపట్నంలో ఉన్న బందరు పోర్టు ప్రాధాన్యాన్ని గుర్తించి త్వరలోనే ఆ దిశగా చంద్రబాబు ఆలోచనలు మారడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు. గత ప్రభుత్వంలో జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పటికే కాపీ కొట్టారని, అయితే మావిగన్‌ ప్రతిపాదనను ఎప్పటికై నా కాపీ కొడతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో జరిగిన మెగా డీఎస్సీ దగాపై మంత్రి నారా లోకేష్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలన్నారు.

ఈవీఎం గోదాంల పరిశీలన

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): నెలవారీ తనిఖీల్లో భాగంగా కాకినాడ కలెక్టరేట్‌ దగ్గరలోని ఈవీఎం, వీవీ పాట్స్‌ గోదాములను కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ రెవెన్యూ, పోలీస్‌, ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రతకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. జిల్లా రెవెన్యూ అధికారి టి.తిప్పే నాయక్‌, కాకినాడ అర్బన్‌ తహసీల్దార్‌ వి.జితేంద్ర, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్‌ఎన్‌డీ పేట ప్రాంతంలో

పులి సంచారం

దేవరపల్లి: గోపాలపురం మండలం కరిచర్లగూడెం, తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం, కరగపాడు, బుచ్చియపాలెం, నందిగూడెం గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి మంగళవారం రాత్రి అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుని పారిపోయింది. కరిచర్లగూడెం శివారులోని మెట్టపై రిజర్వుడు ఫారెస్ట్‌లో పెద్దపులి ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు డ్రోన్‌, ట్రాకర్‌ ద్వారా గురించారు. దాన్ని పట్టుకునేందుకు శ్రీశైలం టైగర్‌ టీం, తూర్పుగోదావరి జిల్లా హనుమాన్‌ టీం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 మంది సిబ్బందిని ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు. పులి దాగి ఉన్న కొబ్బరి, కోకో తోటను అధికారులు చుట్టుముట్టారు. మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చే సమయంలో గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో పులి అక్కడ నుంచి తప్పించుకుని, కరగపాడు, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల వైపు పారిపోయింది. మార్గం మధ్యలో గేదె దూడపై దాడి చేసి హతమార్చింది. వచ్చిన దారిలోనే పులి తిరిగి పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement