అవినీతికి అడ్డాగా చినరాజప్ప పాలన | - | Sakshi
Sakshi News home page

అవినీతికి అడ్డాగా చినరాజప్ప పాలన

Jul 30 2026 12:39 AM | Updated on Jul 30 2026 12:39 AM

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దొరబాబు విమర్శ

సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అతని కుమారుడు రంగనాగ్‌ల అవినీతి రోజురోజుకూ పెరిగిపోతుందని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం కారణంగానే మొదటిసారిగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నిమ్మకాయల చినరాజప్పకు కాపు కోటాలో గతంలో హోం మంత్రి, డిప్యూటీ సీఎం పదవులు లభించాయని తెలిపారు. అటువంటి ముద్రగడపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ముద్రగడ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవించారని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి మృతి చెందితే పార్టీ రహితంగా నివాళి అర్పించాల్సి ఉండగా, సంతాప సభకు హాజరైన వారిని దూషించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వచ్చే నెల 1న పార్టీలకు అతీతంగా కిర్లంపూడిలో ముద్రగడ సంతాప సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిందాల్‌ ఫ్యాక్టరీని తిరస్కరిస్తే ఎమ్మెల్యే చినరాజప్ప మాత్రం ముడుపులు తీసుకుని, రామేశంపేటలో గత వైఎస్సార్‌ సీపీ పాలనలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని అన్నారు. సమాచార చట్టంలో సమాచారం కొరితే జిందాల్‌ ఫ్యాక్టరీ వస్తుందని, వృద్ధాశ్రమం వస్తుందని తమకు తెలియదని అధికారులు సమాచారం ఇచ్చారని దొరబాబు తెలిపారు. రైతులు ఎరువులు, నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కలెక్టర్‌ను కోరిన విధంగా రామేశంపేటలో ఇళ్ల నిర్మాణం చేయగలరా అని ప్రశ్నించారు. చినరాజప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో కొండలను గుల్లచేసి రూ.కోట్లు సంపాదించారన్నారు. అదే అవినీతి నేటికీ కొనసాగుతుందని ధ్వజమెత్తారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూల్‌ ఎడ్యూకేషన్‌ సొసైటీకి చెందిన ఎకరం 75 సెంట్ల భూమిని ఆక్రమించి ఎమ్మెల్యే కుమారుడు ప్రైవేట్‌ లేఅవుట్‌ చేయడానికి ప్రయత్నించడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో 14 వేల మంది ఇళ్ల నిర్మాణ రుణాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్‌, ఆవాల లక్ష్మీనారాయణ, గోపు మురళీ, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, వీరంరెడ్డి నాని, నాగనబోయిన రాజబాబు, వారా సుధాకర్‌, ఇరుసుమళ్ల సాయి, పట్టణ పార్టీ ఽఅధ్యక్షుడు పాగా సురేష్‌కుమార్‌, నేతల హరిబాబు, సేపెని సురేష్‌, రెడ్నం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement