సామర్లకోట: అచ్చంపేట జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రైవేట్ భూములను కూటమి నాయకులు కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ భూముల్లో వరి నాట్లకు సంబంధించి ఊడ్పులు జరగడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో జనచైతన్య పేరుతో 32 మంది రైతుల నుంచి 20 ఎకరాల 88 సెంట్ల భూమిని సేకరించారు. ఆ భూములను లేఅవుట్ చేసి ప్లాట్లు విక్రయించారు. అయితే ఆ లేఅవుట్‌కు మౌలిక సదుపాయాలు లేక ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కత్తిపూడి నుంచి అచ్చంపేట మీదుగా 216 జాతీయ రహదారి నిర్మాణంతో ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనచైతన్య భూముల విలువ పెరిగింది. అయితే ఆ భూముల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి రోడ్డుతో సమానంగా ఉండాలంటే, సుమారు 10 అడుగుల వరకు ప్లాట్లను ఎత్తు చేయాల్సి ఉంది. దాంతో ఆ భూములు ఖాళీగా ఉండటంతో అచ్చంపేటకు చెందిన కూటమి నాయకుల కన్ను పడింది. ఆ భూములను సాగు చేసుకోవడానికి కౌలుకు ఇచ్చి కొందరు సొమ్ము చేసుకొంటున్నారు. లేఅవుట్‌కు సంబంధించి మక్కు రాళ్లు మాత్రం గట్లపై దర్శనం ఇస్తున్నాయి. ఒకసారి లేఅవుట్‌లో గుర్తించిన భూములు తిరిగి ఏవిధంగా సాగులోకి తీసుకు వస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై విచారణ చేసి ప్లాట్లు కొనుగోలు చేసుకున్న వారికి న్యాయం చేయాలని అచ్చంపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డిని వివరణ కోరగా, ప్లాట్లు కొనుగోలు చేసుకున్న వారు ఫిర్యాదు చేస్తే దానిపై స్పందిస్తామని చెప్పారు.


