సామర్లకోట: వెదురు సాగుతో వెయ్యి లాభాలు పొందవచ్చనే సత్యాన్ని వెదురు ప్రాజెక్టు నిరూపిస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. సామర్లకోట టీటీడీసీలో వెదురు సాగు ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో బుధవారం ఆయన టీటీడీసీలో వెదురు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదురు మొక్కల పెంపకం ద్వారా నాలుగేళ్ల నుంచి 40 ఏళ్ల వరకు భారీ ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ మేరకు లక్ష్యాన్ని సాధిస్తారని మహిళలు వివిధ శిక్షణలు పొందుతున్న ఈ కేంద్రాన్ని ఎంపిక చేశామన్నారు. మహిళల ఆర్థిక స్వలంబనకు పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక టీటీడీసీలో మహిళల కోసం చేపట్టిన వివిధ పథకాలను ఆయన సమీక్షించారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాసు, ఏపీడీ జిలానీ, డీసీఎంలు రాయ్, బాబూరావు, భరత్, ఏపీఎంలు అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తల్లి, శిశువుల ఆరోగ్యం కీలకం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తల్లీ శిశువుల ఆరోగ్యం కోసం గర్భధారణ మధ్య సరైన సమయం పాటించడం అత్యంత కీలకమని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 18 వరకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం స్థానికంగా లక్కీడీప్ విజేతలకు నగదు, ప్రశంసాపత్రాలను అందించారు. పిల్లల జననం మధ్య సరైన విధానం పాటించడం వల్ల తల్లి, శిశు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కుటుంబ సంక్షేమం, పిల్లల పోషణ మెరుగుపడుతుందనే విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె.అనిత పాల్గొన్నారు.


