అన్నవరం: రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో బుధవారం వరుణ యాగం ప్రారంభించారు. ఉదయం తొమ్మిది గంటలకు దేవస్థానంలోని దర్బారు మండపంలో గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, వరుణ నామ పారాయణ, విరాట్ పర్వ పారాయణ, ఋష్యశృంగ పారాయణలతో వరుణ యాగానికి అంకురార్పణ చేశారు. కొండ దిగువన పంపా నదిలో నడుము వరకు మునిగి పండితులు వరుణ జపాలు నిర్వహించారు. తూర్పు రాజగోపురం ముందు ఋష్య శృంగునికి పూజలు నిర్వహించి పారాయణ చేశారు. శుక్రవారం జరిగే వరుణ యాగం పూర్ణాహుతితో ముగుస్తుందని అధికారులు తెలిపారు.


