ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఇటీవల మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఆత్రేయపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బొబ్బర్లంక సెంటర్లో ఎస్సై ఎస్.రాము బుధవారం ఉదయం తమ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీ చేస్తున్న విషయం గమనించి నిందితుడు సబ్బు వీరబాబు దొంగిలించిన మోటార్‌సైకిల్ వేసుకుని పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దేవీపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన వీరబాబు (27గా గుర్తించారు. అతడిని విచారించి గత కొన్ని రోజులుగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద పార్కింగ్ ఏరియాలో దొంగిలించిన రూ.మూడు లక్షలు విలువైన నాలుగు మోటార్ సైకిళ్లను అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, కొత్తపేట కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ ముద్దాయికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఆత్రేయపురం ఎస్ఐ తెలిపారు.


