అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామిని బుధవారం తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం) ప్రిన్సిపల్ జడ్జి మౌలానా జునైద్ అహ్మద్ కుటుంబ సభ్యులతో కలసి దర్శనం చేసుకుని పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందజేసి స్వామివారి ఫొటో, ప్రసాదాలు అందజేశారు.
మందపల్లి పార్వతీదేవికి సారె సమర్పణ
కొత్తపేట: ఆషాఢమాసంలో అమ్మవార్లకు సారెను అందించే ఆనవాయితీని అనుసరించి మందపల్లి మందేశ్వర (శనైశ్చర) క్షేత్రంలో పార్వతీదేవి అమ్మవారికి వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం నుంచి బుధవారం సారెను సమర్పించారు. మందపల్లి క్షేత్రంలో దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆషాఢమాసం కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్వతీదేవిని శాకంబరిగా అలంకరించారు. శనైశ్చరస్వామితో పాటు క్షేత్రంలో కొలువైన బ్రహ్మేశ్వర, నాగేశ్వరస్వామివార్లను కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు.
మేళతాళాలతో ఊరేగింపు
దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆ దేవస్థానం తరపున సూపరింటెండెంట్ పి.రాంబాబు, పాలకమండలి తరఫున కో ఆప్టెడ్ సభ్యుడు వాడపల్లి శేషావతారం, దేవస్థానం సిబ్బంది, పండితులు చీర, పసుపు కుంకుమలు, సారె తీసుకు వచ్చారు. వారికి రావులపాలెం – అమలాపురం ప్రధాన రహదారిలో శనైశ్చరస్వామి దేవస్థాన ముఖద్వారం వద్ద ఈఓ సురేష్‌బాబు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, కోలాటం ప్రదర్శన, బాణసంచా కాల్పులతో భారీ ఊరేగింపుగా ఆలయానికి సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. మందపల్లి, ఏనుగుల మహల్, పరిసర గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో మహిళా భక్తులు కూడా సారెను సమర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ సభ్యుడు సిద్దంశెట్టి వీవీ సత్యనారాయణ, దేవస్థానం మాజీ చైర్మన్లు చింతం విజయకృష్ణ మోహన్, సలాది బాబ్జీ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.


