● అశ్లీల నృత్యాల జాబితాలో
రికార్డింగ్ డ్యాన్స్‌లను చేర్చవద్దు
● సినీ హీరోల అనుకరణ కళాకారుల సంఘం నాయకుల విజ్ఞప్తి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పొట్టకూటి కోసం సినీ హీరోలను అనుకరిస్తూ డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తున్న తమకు ఇబ్బంది కలగకుండా అనుమతులు ఇప్పించాలని గోదావరి జిల్లాల సినీ హీరోల అనుకరణ(డూప్)ల కళాకారుల సంఘం అధ్యక్షుడు ములపర్తి అనిల్‌కుమార్ (ఎన్టీఆర్ ఫేమ్), కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు (శోభన్‌బాబు ఫేమ్), పసలపూడి దివాకర్‌బాబు (బాలయ్య ఫేమ్) కోరారు. స్థానిక గణేష్‌చౌక్‌లోని ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడచిన 40 ఏళ్లకు పైగా ఈ వృత్తినే నమ్ముకుని చాలామంది జీవనం సాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 70 వేల మంది కళాకారులు ఈ వృత్తిలో ఉన్నారని, జిల్లాలో 3500 మంది వరకు ఉన్నారని తెలిపారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే ఆయా ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలకు తమకు ప్రదర్శనలు ఉంటాయని, మిగిలిన సమయం దాదాపు ఖాళీగానే ఉంటూ ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామన్నారు. అయితే కొంతమంది అశ్లీల నృత్యాలు చేయడం వలన తమలాంటి కళాకారులకు ఇబ్బంది వస్తోందని, ఫలితంగా తమకు కూడా కొన్నిచోట్ల అనుమతులు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా ప్రదర్శనలు ఇస్తున్నామని, ఇబ్బందులు కలిగించకుండా అనుమతి ఇచ్చేలా చూడాలని, తద్వారా తమను ఆదుకోవాలని డూప్ హీరోలు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల దృష్టికి విషయాలను తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.


