● యువకుడి దుర్మరణం
● మరొకరికి తీవ్రగాయాలు
కురవి: ఓ బొలెరో వాహనం (కోళ్లవ్యాన్) రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా (మహబూబాబాద్ జిల్లా) పరిధి కురవి మండలం బంచరాయి తండా జీపీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల సమీపాన బంగారుగూడెం క్రాస్ రోడ్డుపై చోటు చేసుకుంది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మల్లిడి సాయినాఽథ్‌రెడ్డి(18), గంజి శివ కొంతకాలంగా మహబూబాబాద్‌లోని భవానీనగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం వీరు బైక్‌పై మహబూబాబాద్ నుంచి బయ్యారం వైపునకు వెళ్తున్నారు. ఇదే సమయంలో బయ్యారం నుంచి మహబూబాబాద్ వెళ్తున్న బొలెరో రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయినాథ్‌రెడ్డి అక్కడికక్కడే మరణించగా శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో క్షతగాత్రు డిని వెంటనే అంబులెన్స్‌లో మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


