అడ్డతీగల: వేటమామిడి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న యాట్ల సాత్విక అనే గిరిజన విద్యార్థిని సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. గంగవరం మండలం నీలవరానికి చెందిన ఆ విద్యార్థిని రెండేళ్లుగా ఏకలవ్య స్కూల్లో చదువుకుంటోంది. సోమవారం సాయంత్రం ఊపిరాడని పరిస్థితి తలెత్తడంతో స్కూల్ సిబ్బంది అడ్డతీగల సీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. గతం నుంచి ఈ బాలికకు షుగర్ ఉన్న నేపథ్యంలో దానికి మందులు వాడుతోందని బాలిక బంధువులు, ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. షుగర్ ఎక్కువగా ఉన్న కారణంగా ఊపిరాడని పరిస్థితి తలెత్తిందని వైద్యులు తెలిపారు. ప్రాథమిక వైద్యం అందించిన వెంటనే అంబులెన్స్‌లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు.
ముగిసిన సీబీఎస్‌ఈ స్కేటింగ్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ వివేకానంద పార్కు ఆవరణలోని వైఎస్సార్ మున్సిపల్ స్కేటింగ్ రింక్‌లో నాలుగు రోజులుగా లిటిల్ వుడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న సీబీఎస్‌ఈ సౌత్‌జోన్ స్కేటింగ్ పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. చివరి రోజు కార్యక్రమానికి లిటిల్‌వుడ్స్ స్కూల్ చైర్మన్ జీకేవీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్లు జి.రాధాలక్ష్మి, శ్రీరామ్ సుహాన్‌లు అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, అండమాన్ నికోబార్ నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 9, 11, 17 బాలుర, బాలికల విభాగాల్లో పోటీలు జరిగాయి.
క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలి
విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ అన్నారు. కాకినాడ సురేష్ నగర్‌లోని శ్రీప్రకాష్ స్కూల్‌లో సీబీఎస్‌ఈ బాలుర బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెలేలు కొండబాబు, పంతం నానాజీలు, ఎన్‌సీసీగ్రూప్ కాకినాడ కమాండెంట్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ అతిథులుగా విచ్చేశారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
సామర్లకోట: పెద్దాపురం రామారావుపేట లోని శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలన చేతన్ ఆనంద్ సందర్శించారు. పాఠశాల ఆవరణ, అక్కడి ఆట స్థలాలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు.శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు సూచించిన మార్గంలో విద్యార్థులు ప్రయా ణం చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, ఆత్మకథ పుస్తకాలను అందజేశారు.
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు..
తుని: శ్రీప్రకాష్‌కు చెందిన అండర్ – 19 బాలికల ఖోఖో జట్టు సీబీఎస్‌ఈ క్లస్టర్ పోటీల్లో విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిందని సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 26 వరకు తెలంగాణలోని కరీంనగర్‌లో నిర్వహించిన ఖోఖో పోటీల్లో ఈ జట్టు విజయం సాధించి, బంగారు పతకాన్ని కై వసం చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజధాని చైన్నెలో సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు.


