కాకినాడ క్రైం: ఓ తల్లి కన్న శిశువును తమకివ్వాలని కొందరు హిజ్రాలు ఘర్షణకు దిగడంతో కాకినాడ జీజీహెచ్‌లో అలజడి రేగింది. వివరాల్లోకి వెళితే.. అమలాపురానికి చెందిన 30 ఏళ్ల ఆకుమర్తి మేరీ కుమారి తన భర్త ఉండుర్తి శ్రీనుతో విడిపోయింది. 9 ఏళ్ల కుమార్తె ఉండగా తండ్రితోనే ఉంటోంది. ఆ తర్వాత మేరీకి నరేష్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఏడాదిన్నర క్రితం అమలాపురం నుంచి ఆమెను తీసుకొచ్చిన నరేష్ రాజమహేంద్రవరంలో నివాసం ఉంటూ సహజీవనం చేశాడు. ఈ క్రమంలో మేరీ కుమారి గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసి నరేష్ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. పోషణ బరువవ్వడంతో నిండు చూలాలిగా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో భిక్షాటన చేస్తూ మేరీ బతుకీడుస్తోంది.
దీనగాథ విని.. : సామర్లకోటకు చెందిన శ్రీకన్య అనే హిజ్రా సుమారు 10 రోజుల క్రితం రైలులో భిక్షాటన కోసం రాజమహేంద్రవరానికి వెళ్లింది. అక్కడ స్టేషన్‌లో మేరీని చూసి, ఆమె డబ్బులు అడగడంతో రూ.50 ఇచ్చింది. ఆమె దీనగాథ విన్న శ్రీకన్య చలించి చేరదీసింది. గర్భిణి అనుమతితో సామర్లకోటకు తీసుకొచ్చి ఇంట్లో ఉంచింది. ఇంటికి చేరాక, నీ బిడ్డను నాకిస్తావా.. నిన్ను. బిడ్డను బాగా చూసుకుంటానని కోరింది. అందుకు మేరీ అంగీకరించింది. అప్పటి నుంచి మంచి ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు అందించింది. ప్రసవ నొప్పులు రావడంతో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి మేరీని శ్రీకన్య కాకినాడ జీజీహెచ్‌లో చేర్చింది. 25వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకి మేరీ 2.5 కిలోల బరువుతో పండంటి మగ బిడ్డను ప్రసవించింది.
ఆస్పత్రిలో ఘర్షణ : బిడ్డను శ్రీకన్యకు ఇవ్వడానికి ఆమె తల్లి ఒప్పకోకపోవడంతో గొడవ మొదలైంది. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో మేరీకుమారి, శ్రీకన్య మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆసుపత్రి వర్గాల ద్వారా విషయం వన్‌స్టాప్ సెంటర్‌కు చేరింది. పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు, సిబ్బంది మేరీకి రక్షణగా నిలిచారు. వార్డులో వైద్య సిబ్బంది సాయంతో ఆమెను సంరక్షిస్తున్నారు. తన బిడ్డను ఇవ్వనని, తమ ఇద్దరికీ రక్షణ కల్పించాలని బాలింత వారిని కోరింది. ఈ నేపథ్యంలో శ్రీకన్య సోమవారం సాయంత్రం మరికొందరు హిజ్రాలతో కలిసి ఆసుపత్రిలో ఘర్షణకు దిగింది. వారంతా వార్డును చుట్టుముట్టడంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘర్షణ తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ బిడ్డ తనదేనంటూ శ్రీకన్య బృందం వాదిస్తుండడంతో మేరీకి, ఆమె బిడ్డకు వార్డులో పోలీస్ భద్రత మధ్య వైద్య సేవలు కొనసాగుతున్నాయి.
ఫ కాకినాడ జీజీహెచ్‌లో అలజడి
ఫ హిజ్రాలు, బాలింత మధ్య ఘర్షణ


