అధనపు దోపిడీ ! | - | Sakshi
Sakshi News home page

అధనపు దోపిడీ !

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

ఎప్పుడైనా దొరుకుతోంది

జిల్లాలో ఏ సమయంలోనైనా మందు దొరుకుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. అలాగే బార్లలో ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే విక్రయాలు చేపట్టాలి. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతోంది. సమయం పాలన పాటించడం లేదు. ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.30 నుంచి రూ.50 ఇస్తే ఏ సమయంలోనైనా ఇస్తున్నారు.

మద్యం పాలసీ అన్నారు.. మహా దోపిడీ చేస్తున్నారు. ఎమ్మార్పీకే అందిస్తామన్నారు.. ఎక్కువేసి అమ్మేస్తున్నారు.. అంతా ‘కూటమి’గా ఏర్పడి అనధికార బాదుడికి తెరతీశారు.. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారు.. రోజుకు రూ.లక్షల్లో దోచేస్తున్నా అడిగేవారు లేకపోయారు. ‘బాబు’రే ఇదేం బాదుడు అంటూ మందుబాబులు నిట్టూర్పు వదులుతున్నారు.

బరితెగించిన మద్యం సిండికేట్‌

క్వార్టర్‌పై రూ.10 అదనపు వసూళ్లు

ఏడాదిన్నరలో బాటిల్‌పై

రూ.30 పెరుగుదల

సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ప్రభుత్వంలోని మద్యం సిండికేట్‌ బరితెగిస్తోంది. అధికార అండతో రెచ్చిపోతోంది. నిర్దేశించిన ఎమ్మార్పీని ఉల్లంఘించి విక్రయాలు చేపడుతోంది. క్వార్టర్‌పై రూ.10 నుంచి రూ.20 అదనంగా బాదేస్తోంది. ఇలా రోజూ రూ.లక్షల్లో ఆర్జిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో సజావుగా నడుస్తున్న వ్యవస్థను అతలాకుతలం చేసింది. కూటమి నేతలకు కట్టబెట్టేందుకు ప్రైవేటు విధానాన్ని తీసుకువచ్చింది. మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించి, కూటమి నేతలు లబ్ధి పొందేలా చేసింది. ప్రైవేటుకు అప్పగించిన మొదట్లో అనధికారికంగా క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 పెంచి విక్రయిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించింది. ఇలా రూ.190 ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ రూ.200కు చేరింది. అనంతరం సంక్రాంతి పండగకు అధికారికంగా క్వార్టర్‌ బాటిల్‌పై మరో రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ.210కు చేరింది. బాటిల్‌పై ఎమ్మార్పీ ధర మాత్రం రూ.200 ఉంటుంది. తాజాగా మద్యం సిండికేట్‌ మరో అడుగు ముందుకేసింది. మరో రూ.10 అనధికారికంగా పెంచేసింది. ప్రస్తుతం సిండికేట్‌ పెంచి వసూలు చేస్తున్న రూ.10తో క్వార్టర్‌ ధర రూ.220కు చేరింది. ఈ పెంపు అన్ని బ్రాండ్లకు వర్తింపజేస్తోంది. దీంతో మద్యం దుకాణం వద్దకు వెళ్లిన మందుబాబులకు ఒక్కసారిగా షాక్‌ తగులుతోంది. ఇదిలా ఉంటే ఆఫ్‌ తీసుకున్నా అదనంగా రూ.10 చెల్లించాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా ఒకసారి, అనధికారికంగా రెండు సార్లు అదనపు బాదుడిపై మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. మందుబాబులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పుడు మద్యం షాపుల యజమానులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ ఎత్తుగడ వేసింది. బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నా.. ప్రభుత్వం, ఎకై ్సజ్‌ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

బెల్టుషాపుల్లో మరింత..

మద్యం షాపుల్లో ధరలు పెరగడంతో అందుకు అనుగుణంగా నడుస్తున్న బెల్టు షాపుల్లో కూడా మరింత బాదుడు తప్పడం లేదు. ప్రతి మద్యం షాపునకు అనుబంధంగా 10 నుంచి 20 బెల్టు షాపులు వెలిశాయి. తమకు కావాల్సిన బ్రాండ్లు ఫోన్‌లో అర్డర్‌ ఇస్తే చాలు, అనుకున్న సమయానికి చేరిపోతున్నాయి. పండగలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు తదితర ఫంక్షన్లకు ఎక్కువ మొత్తం ఆర్డర్లు ఇస్తున్నారు. గతంలోనే ఎమ్మార్పీ కంటే ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం బాటిల్‌పై రూ.10 పెరగడంతో వారి ధర సైతం పెంచేశారు. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 అదనంగా తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది.

జిల్లాలో వ్యాపారం ఇలా..

జిల్లాలో మొత్తం 170 మద్యం షాపులున్నాయి. వీటికి సామర్లకోట ఐఎంఎల్‌ డిపో నుంచి సరకు సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 4,201 కేసుల బీర్లు, 9,651 కేసుల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అంటే నెలకు 1,26,030 కేసుల బీర్లు, 2,89,530 కేసుల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వీటి విలువ రోజుకు సుమారు రూ.7.95 కోట్లు ఉండగా.. నెలకు సుమారు రూ.238 కోట్ల వ్యాపారం జరుగుతోంది. పండగ రోజుల్లో మరింత అధికంగా ఉంటుంది. ఆ రోజుల్లో సుమారు రూ.8 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. అనధికారికంగా పెంచి వసూలు చేస్తున్న రూ.10తో ప్రతి నెలా మందుబాబులపై రూ.41,55,600 అదనపు భారం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement