పుడుతూనే గిడుతు.. | - | Sakshi
Sakshi News home page

పుడుతూనే గిడుతు..

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

అమ్మ గర్భం నుంచి ఆపదలన్నీ దాటి ఊపిరిపోసుకున్న శిశువు ఊపిరిరాడక విలవిలలాడుతోంది. నవమాసాలు మోసి కన్న అమ్మ, బిడ్డ పుట్టే మైమరపులో బతికేస్తున్న నాన్న గుండెల్ని పిండేస్తుంది. ఏ దేవుడి తలరాతో.. కన్నైనా తెరవకుండానే కన్ను మూస్తున్న దయనీయత హృదయాంతరాళాల్ని బరువెక్కిస్తోంది. ముక్కుపచ్చలారని శిశుతనం అసువులు బాసుతోంది. ఈ పాపంలో సర్కారు నిర్లక్ష్యం అలముకుంది.

జీజీహెచ్‌లోనే 169 మరణాలు

కాకినాడ జీజీహెచ్‌ను చంటి పిల్లల వైద్య సేవలకు అత్యంత సురక్షిత కేంద్రంగా చెబుతారు. అందుకు కారణం కోరమండల్‌, ఓఎన్జీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు జీజీహెచ్‌ పీడియాట్రిక్స్‌ విభాగాన్ని పూర్తి సదుపాయాలతో తీర్చిదిద్దడమే. అటువంటి జీజీహెచ్‌లోనే 169 మంది శిశువులు చనిపోయారు. మరో 11 మంది జిల్లాలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 12 మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో, 15 మంది ఇళ్ల వద్ద, 26 మంది ఆసుపత్రికి తరలిస్తూ, ఇతర ప్రయాణాల్లో మృతి చెందారు.

కన్నపేగుకు కన్నీరు

ఏడాదిలో 233 శిశు మరణాలు

నివారణ చర్యలు శూన్యం

కాకినాడ క్రైం: జిల్లాలో శిశు మరణాలు ఆవేదన కలిగిస్తున్నాయి. ఏడాది కాలంలో వందలాది ప్రాణాలు పోయాయి. ఉన్నతాధికారుల నుంచి ఆయా శాఖల అధికారుల వరకూ శిశు మరణాల నివారణే లక్ష్యం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నా, క్షేత్రస్థాయి వాస్తవికతకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. జిల్లాలో కేవలం ఏడాదిలో 233 శిశు మరణాలు చోటుచేసుకున్నాయి. ఇందులో అప్పుడే పుట్టిన శిశువులతో పాటు ఐదేళ్లలోపు పసిమొగ్గలున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి. అందులో కాకినాడ డివిజన్‌ పరిధిలో 111, పెద్దాపురం డివిజన్‌ పరిధిలో 122 మరణాలు చోటుచేసుకున్నాయి. 0–28 రోజుల మధ్య శిశువులు 127 మంది మరణిస్తే, 29 రోజుల నుంచి ఏడాది లోపు వారు 76 మంది, ఏడాది కంటే ఎక్కువ వయసున్న వారు 30 మంది ఉన్నారు.

గ్రామీణంలోనే ఎక్కువగా..

శిశు మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా చోటు చేసుకోవడం, వైద్య సేవల కొరతకు అద్దం పడుతోంది. జిల్లాలో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 178 మంది శిశువులు ప్రాణాలు కోల్పోవడం విస్మయానికి గురిచేస్తోంది. అర్బన్‌ ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య 55గా నమోదైంది.

కారణాలు ఏంటంటే..

నియోనియాతో 25 మంది, నెలలు నిండక, బరువు తక్కువతో 44, నియోనాటల్‌ ఇన్‌ఫెక్షన్‌తో 29, బర్త్‌ ఆస్‌ ఫిక్సియా, బర్త్‌ ట్రామాతో 37, ఫిట్స్‌తో ఒకరు, ప్రమాదాలు సంభవించి ఆరుగురు, సర్జికల్‌ కండీషన్స్‌తో ఒకరు, కాన్జనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌తో ఐదుగురు, ఘన, ద్రవాల కల్తీతో ముగ్గురు, నీట మునిగి ముగ్గురు, ఇతర కారణాలతో 65 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి ఐదేళ్లలోపు పసివాళ్లే.

పాలు తాగుతూ..

ఈ మరణాల్లో మరింత హృదయవిదారక సందర్భాలు ఏంటంటే, శిశువు పాలు తాగుతూ ప్రాణాలు కోల్పోవడం. ఏడాది కాలంలో ఏకంగా 14 మంది శిశువులు పాలు తాగుతూ ప్రాణాలొదిలారు. గర్భధారణ మొదలు అంగన్‌వాడీ సిబ్బంది నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల వరకు తల్లి వెంటే ఉంటూ వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నామని చెబుతుంటారు. అయితే అదెక్కగా జరగడం లేదు. కనీసం బిడ్డకు పాలెలా పట్టాలో కూడా తల్లికి వివరించలేని నిర్లక్ష్యం కొనసాగుతోంది.

కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం

కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లో రెండు సార్లు సమీక్షలు నిర్వహించాం. అంతకుముందు పరిస్థితిపై ఆరా తీస్తున్నాం. శిశు మరణాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు కారణాలను పరిశీలిస్తున్నాం. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉంటే శిశు మరణాలు తగ్గించవచ్చని గుర్తించాం. అందుకు తగిన మార్గనిర్దేశం ఇచ్చాం. పాలు పట్టే శాసీ్త్రయ విధానాలను తల్లులకు అందించేలా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాం. రక్తహీనత, న్యూమోనియా సహా పోషకాహార లోపం కూడా శిశు మరణాలకు కారణమవుతోంది. వీటిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

–డాక్టర్‌ కోనాల అనిత, డీఎంహెచ్‌ఓ, కాకినాడ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement