ఫ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి
ఫ వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డీఎస్సీలో పెద్దఎత్తున అక్రమాలు, అవినీతి జరిగిందని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ఆధారాలు చూపించారు.. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి లోకేష్ స్పందించలేదని ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్రమైన కాకినాడలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. దీనిని బట్టి చూస్తే లోకేష్‌కు బాధ్యత, నైతికత ఉందా? అని ప్రశ్నించారు. అక్రమాలు నిరూపించాలని గతంలో లోకేష్ ఛాలెంజ్ చేస్తే.. తాము సిద్ధమయ్యామని, టీడీపీ నేతలు, లోకేష్ మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. నీట్ అక్రమాలపై యువత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే.. బాధ్యత వహిస్తూ మీ కూటమిలోని బీజేపీకి చెందిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. లోకేష్‌కు నైతిక బాధ్యత లేదా అని నిలదీశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. అక్రమ వ్యవహారం నిగ్గుతేలే వరకు వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.
తుపాన్ హెచ్చరికలతో వేటకు వెళ్లరాదు
కొత్తపల్లి: తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని నియోజకవర్గ మత్స్యశాఖ అధికారి శివరామకృష్ణ అన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం తుపాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని అన్నారు. కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో ఆదివారం మత్స్యశాఖ అధికారులు పర్యటించారు. తీర ప్రాంతంలో లంగరు వేసిన బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని, వలలు, వేట సామగ్రిని భద్రపరచుకోవాలని సూచించారు. వేటకు మత్స్యకారులు ఎవరైనా వెళ్తే, తక్షణమే తీరానికి చేరుకోవాలని అన్నారు. తుపాన్ కారణంగా సముద్రంలో అలల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున, తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై గ్రామాల్లో ప్రచారం చేయిస్తున్నట్లు వివరించారు.
ఆర్డీఓ ఇంట్లో చోరీ
పెద్దాపురంలో ఘటన
సామర్లకోట: పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి పి.కృష్ణమూర్తి ఇంట్లో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపురం రామారావుపేటలో ఆర్డీఓ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. రోజులాగే శనివారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంటి బీరువాలోని 10 కాసుల బంగారు ఆభరణాలు, రూ.70 వేలు చోరీ చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో క్రైం సీఐ అంకబాబు, సీఐ వైఆర్‌కే శ్రీనివాసు, పెద్దాపురం పోలీసు సిబ్బంది, వేలిముద్ర నిపుణులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై మత్తు మందు పిచికారీ చేసి ఉంటారని, దీని కారణంగా మెలుకువ రాలేదనే వాదనలు వినిపించాయి. కాగా ఆర్డీఓ నివా సం ఉంటున్న ఇంటి వెనుక తలుపులు వేయకపో వడంతో అటు నుంచి దొంగలు ఇంట్లోకి చొరబడి ఉంటారని సీఐ శ్రీనివాసు తెలిపా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
30న సప్తకళా వేడుకలు
ఐ.పోలవరం: పుల్లెల తాతయ్య మెమోరియల్ అసోసియేషన్ (పీటీఎం), ప్రజ్ఞా సాహితి సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 30న ఐ.పోలవరంలో సప్తకళా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన రావి బేబీ సత్యవాణి కూచిపూడి నృత్య ప్రదర్శన, సుప్రసిద్ధ రంగస్థల నటి మహంతి రమణ బృందంతో తారామణి నాటక ప్రదర్శన, ప్రముఖ మెజీషియన్ వి.శ్రీరామారావు మ్యాజిక్ షో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు శాస్త్ర దిగ్గజాలు అనే అంశంపై వకృత్వం, పాటల పరిమళాలు, కవితా లహరి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్య అతిథిగా పరిపాలనాధికారి బీహెచ్‌ఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం, విశిష్ట అతిథిగా ఎంఈఓ ఎన్.ప్రసాద్ కుమార్ పాల్గొంటారన్నారు. కార్యక్రమాల బ్రోచర్‌ను నిర్వాహకులు ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రేవు యజ్ఞశ్రీ, ప్రత్తి సత్తిబాబు, ఎ.వెంకట నారాయణ, వి.లక్ష్మీనారాయణ, పల్లెపు వెంకటేశ్వరరావు, ఎస్.పుల్లారావు పాల్గొన్నారు.


