అమలాపురం టౌన్: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాలకు పెద్ద దిక్కు అని వివిధ రాజకీయ పార్టీల నేతలు కొనియాడారు. ఆయన మరణంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు.. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఉద్యమాల పరంగా ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లయ్యిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యాన అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో ఆదివారం దివంగత ముద్రగడ పద్మనాభం జిల్లా స్థాయి సంతాప సభ నిర్వహించారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమితి రాష్ట్ర నాయకుడు నల్లా పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ఉద్యమ స్ఫూర్తి, నిజాయితీ, ముక్కుసూటితనం ఉన్న ముద్రగడను కోల్పోవడం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ, ముద్రగడ మరణంతో ఉద్యమాల ఊపిరి ఆగిందా అనే సందేహం కలుగుతోందని అన్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ, తన తండ్రి, మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత బాలయోగి, ముద్రగడ పద్మనాభం ఒకేసారి ఎంపీలుగా పని చేశారని గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పాముల రాజేశ్వరీదేవి మాట్లాడుతూ, ముద్రగడతో తమకున్న అనుబంధాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అముడా) చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, కాపు జేఏసీ నాయకులు కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, జిల్లా అధికార ప్రతినిఽధి సూదా గణపతి, మాజీ కౌన్సిలర్ చిట్టూరి పెదబాబు, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, అడబాల సత్యనారాయణ, టీడీపీ, జనసేన నాయకులు మెట్ల రమణబాబు, నల్లా శ్రీధర్, ఏడిద శ్రీను తదితరులు తమ ప్రసంగాల్లో ముద్రగడ ఉద్యమాల పంథాను కొనియాడారు. నేతలందరూ ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ ముద్రగడ అంటూ నినాదాలు చేశారు.
ఫ ఘన నివాళులర్పించిన
అఖిలపక్ష నేతలు
ఫ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యాన సంతాప సభ


