అన్నవరం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి, పంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో త్వరలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. గురువారం ఆయన దేవస్థానం వేదపండితులు, ప్రధానార్చకులు, ఇతర వైదిక కమిటీ సభ్యులతో సమావేశమై ఈ యాగం నిర్వహణపై చర్చించారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, రైతు ప్రయోజనాలు ఆకాంక్షిస్తూ ఈ యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాగం ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ముహూర్తం నిర్ణయించాలని దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, పంచాంగ కర్త శ్రీతంగిరాల వెంకట కృష్ణ పూర్ణప్రసాద్ సిద్ధాంతిని కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు గంగాధరబట్ల గంగబాబు, చిట్టి శివ, గొల్లపల్లి ఘనాపాఠి, వేదుల సూర్యనారాయణ, యనమండ్ర శర్మ, ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు, పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.


