ఆటంకాలు దాటేనా! | - | Sakshi
Sakshi News home page

ఆటంకాలు దాటేనా!

Jul 24 2026 12:40 AM | Updated on Jul 24 2026 12:40 AM

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): అమరావతి చాంపియన్‌షిప్‌ పేరుతో ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసింది. 12 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని ప్రకటించింది. అయితే పోటీల నిర్వహణకు నియోజవర్గానికి కేవలం రూ.5 వేలు మాత్రమే కేటాయించింది. ఈ సొమ్ముతో ఎలా నిర్వహించాలో తెలియని పరిస్థితి నిర్వాహకులకు ఏర్పడింది. అలాగే క్రీడా పరికరాలు సమకూర్చకపోవడం, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో తగినంత మంది వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడంతో నిర్వహణ కత్తిమీద సాములా మారింది.

వసతుల కొరత

జాతీయ క్రీడా దినోత్సవాన్ని (ధ్యాన్‌చంద్‌ జయంతి, ఆగస్టు 29) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కలసి రూ.90 లక్షల ప్రైజ్‌మనీతో అమరావతి చాంపియన్‌ షిప్‌ పేరుతో క్రీడా పోటీలకు సన్నాహాలు చేశాయి. ఈ టోర్నమెంట్‌ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. క్రీడాప్రాధికార సంస్థతో పాటు విద్యాశాఖ సమన్వయంతో నిర్వహించాలని, పోటీల నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలల మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులను వినియోగించుకోవాలని ఇప్పటికే ఆయా యూనివర్సిటీలు, కళాశాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో వసతులు, మైదానాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వ్యాయామ అధ్యాపకులు లేకపోడంతో ఈ టోర్నమెంట్‌ నిర్వహణ క్రీడాభివృద్ధి ఽఅధికారులకు కత్తిమీద సాములా తయారైంది. మరో వైపు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడాయాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్‌ నత్తనడకగా సాగిందనే విమర్శలు వస్తున్నాయి.

ఈ నెల 27 నుంచి షెడ్యూల్‌

అమరావతి చాంపియన్‌ షిప్‌ను ఈ నెల 15 నుంచి ఆగస్టు 26 వరకు నిర్వహించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు కురవడంతో నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 27 నుంచి షెడ్యూలు ప్రకటించారు. అండర్‌ 17, 23 విభాగాల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, బాస్కెట్‌ బాల్‌, చెస్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌, యోగాతో కలిపి 12 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ నెల 27న తుని క్రీడా వికాస కేంద్రం, 28న ప్రత్తిపాడు జెడ్పీ పాఠశాల, 27న జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల, 28న పెద్దాపురం లూథరన్‌ పాఠశాల, 29న పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ కళాశాల, 30న కాకినాడ ఆర్బన్‌ పరిధిలో, 31న కాకినాడ రూరల్‌ పరిధిలో కాకినాడ డీఎస్‌ఏలో నియోజకవర్గస్థాయిలో పోటీల నిర్వహణకు క్రీడాప్రాధికార సంస్థ అధికారులు షెడ్యూలు ప్రకటించారు.

దాతలే ఆధారం

నియోజకవర్గ స్థాయిలో పోటీల నిర్వహణకు కేవలం రూ.5 వేలను ప్రభుత్వం కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యేలు, దాతల సహకారంతో పోటీలు నిర్వహించాలని ఆదేశించింది. అవుట్‌ డోర్‌ గేమ్స్‌ అయిన వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, హాకీ, అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌ పోటీలు నిర్వహించేందుకు అనువైన క్రీడా మైదానాలు లేకపోవడం, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పీడీల కొరత, మైదానాలు అంతంత మాత్రంగా ఉండడంతో పోటీల నిర్వహణకు ఇబ్బంది కలుగుతుందని క్రీడాసంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు.

కాకినాడ డీఎస్‌ఏలో వర్షం కారణంగా బురదగా మారిన మైదానం

పెద్దాపురం లూథరన్‌ హైస్కూల్‌ మైదానం

ఆదేశాలు ఇవే..

పోటీల్లో పాల్గొనే విద్యార్ధులకు మిడ్డే మీల్స్‌లో భోజన సదుపాయాలు కల్పించాలి. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లాకు వచ్చే క్రీడాకారుల్లో బాలికలు, మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. పురుషులు, బాలురకు ఒక వైపు చార్జీలు మాత్రమే అందిస్తారు. ఇక ప్రైజ్‌ మనీ రూ.90 లక్షలు ప్రకటించినా ఏ స్థాయిలో ఎంత ఇస్తారనే దానిపై స్పష్టత లేదు.

అమరావతి చాంపియన్‌ షిప్‌

నిర్వహణకు ప్రభుత్వం ఆదేశం

పోటీల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల

అరకొరగా నిధుల కేటాయింపు

నిర్వాహకులకు కత్తిమీద సాము

వేధిస్తున్న మైదానాల కొరత, వసతుల లేమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement