● తాటిపండుతో ఎన్నో ఉపయోగాలు
● నోరూరించే వంటకాలు
● రుచికరమైన స్వీట్ల తయారీ
● తినడానికి ఆసక్తి చూపుతున్న ప్రజలు
ఆలమూరు/మలికిపురం: వేసవిలో మండే ఎండలు, వేడి నుంచి ఉపశమనానికి తాటిముంజెలను తింటూ ఉంటాం. అలాగే శీతాకాలం చివరిలో వచ్చే తేగలంటే అందరికీ ఇష్టమే. ఈ రెండు కాలాల మధ్య మనకు లభించే తాటిపండుకు ఎన్నో పోషక గుణాలున్నాయి. దీని గుజ్జు నుంచి వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు తయారు చేస్తున్నారు. ప్రముఖ స్వీట్ షాపుల్లోనూ తాటి పండు వంటకాలు లభిస్తున్నాయి. ముంజెకాయ పండిపోయి తాటి పండు రూపంలో చెట్టు నుంచి నేల మీదకు పడుతుంది. దాని నుంచి తీసిన గుజ్జుతో ఇడ్లీలు, గారెలు, రొట్టెలు చేసుకుని తినడం మన పూర్వకాలం నుంచీ వస్తోంది. ఆధునిక కాలంలో తాటిగుజ్జుతో స్వీట్లు కూడా తయారు చేస్తున్నారు.
కనుమరుగు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఒకప్పుడు ఎక్కడ చూసినా తాటిపండ్లు విరివిగా లభించేవి. కానీ ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు చెట్ల నుంచి జారి పడిన తాటిపండ్లను రైతులు తమ చుట్టుపక్కల వారికి ఉచితంగా ఇచ్చేవారు. కానీ నేడు పల్లెల్లో కూడా వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తుని, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో రోడ్డు పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి, తాటిపండును సైజును బట్టి రూ.30 నుంచి రూ.50 వరకూ విక్రయిస్తున్నారు.
రుచి మధురం
తాటిపండు గుజ్జుకు బెల్లం, వరి నూక, కొబ్బరి కోరును సమపాళ్లలో కలిపి ముద్దగా తయారు చేస్తారు. దానిలో గారెలు, రొట్టెలు తయారు చేసుకోవచ్చు. తాటి గుజ్జుతో తయారు చేసిన తాండ్ర మరింత రుచికరంగా ఉంటుంది. ముందుగా గుజ్జును శుభ్రమైన తాటాకు చాప మీద రోజూ పొరలా పూస్తుంటారు. అలా ఎండిన గుజ్జు కొద్ది రోజుల తర్వాత మందంగా మారి తాండ్రగా తయారవుతుంది. ఈ తాండ్రను చిన్నారులు అమితంగా ఇష్టపడతారు. తాటిగుజ్జుతో చేసిన వంటకాలు నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి.
ఆరోగ్యకరం
తాటి పదార్థాల్లో ఏ, బీ, సీ విటమిన్లు, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి అధిక పోషకాలు ఉండటం వల్ల మానవ శరీరంలో కణజాల పెంపునకు దోహద పడతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. తాటి టెంకలో ఉండే పీచుతో జీర్ణకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తేగలు తింటే మలబద్ధకం దూరమవుతుంది. తాటి ముంజెలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చలువ దనాన్ని ఇస్తాయి. తాటి తాండ్రను తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారు మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


