విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి

Jul 23 2026 1:12 AM | Updated on Jul 23 2026 1:12 AM

రామచంద్రపురం రూరల్‌: కుటుంబ భారం మోసే యువకుడి మృతితో ఆ కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్‌, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని వెలంపాలెం గ్రామానికి చెందిన యడ్ల రామాంజనేయులు (33) తాపీ పని చేస్తూ వృద్ధురాలైన తల్లితో కలసి జీవిస్తున్నాడు. అతడికి 8 మంది అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. కుటుంబ బాధ్యత నెత్తిమీద వేసుకుని అక్కల పెళ్లిళ్లు చేయడంతో పాటు వారి మంచిచెడు అతడే చూస్తూ ఉంటాడు. వృద్ధురాలైన తల్లి కళ్లు కనిపించని స్థితిలో అతడే ఆధారంగా ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం ద్రాక్షారామలో ఒక ప్రైవేటు భవనం పై అంతస్తులో పిట్ట గోడ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ఊచ జారి 33 కేవీ విద్యుత్‌ లైన్‌ వైరు తగలడంతో ప్రమాదానికి గురయ్యాడు. దీనితో స్థానికులు ద్రాక్షారామలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనితో రామాంజనేయులు సోదరుడు యడ్ల వెంకన్న ఫిర్యాదు, ఆసుపత్రి సమాచారాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్‌ తెలిపారు.

జయహో జాతీయ పతాక..

మామిడికుదురు: స్థానిక పాఠశాలలో బుధవారం జాతీయ జెండా (పతాక) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారతదేశ నమూనా (మ్యాప్‌) ఆకారంలో నిలబడి, చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని అందరినీ అలరించారు. 1947 జూలై 22న రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిందని స్కూల్‌ కరస్పాండెంట్‌ డీవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి జూలై 22వ తేదీని జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని జరుపుకొంటున్నామన్నారు. మన జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ హెచ్‌ఎం యక్కలదేవర నాగన్నబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement