● ఏడేళ్లుగా మంచంపైనే జీవనం!
● నేతన్న దీనావస్థ
పిఠాపురం: తన చేతులతో అందమైన చీరలు నేసిన నేతన్నకు నేడు ఎంతో కష్టం వచ్చింది. చేయి తిరిగిన చేనేత కార్మికుడిగా పేరొందాడు. అనుకోని అతిథిలా వచ్చిన ఆపద అతనిని మంచాన పడేసింది. గత ఏడేళ్లుగా ఆయన మంచానికే పరిమిత మయ్యాడు. శరీరం రాను రాను క్షీణించడంతో ఆహారం ఏదీ లోపలికి వెళ్లక కేవలం తాగు నీరు మాత్రమే ఆధారంగా ఏడు నెలలుగా జీవన పోరాటం చేస్తున్నాడు. కొత్తపల్లికి చెందిన చేనేత కార్మికుడు పొన్నగంటి అప్పారావు పరిస్థితి ఇది. ఆయన భార్య గతంలో మృతి చెందగా ఒక్కగానొక్క కూతురి వద్దే ఆయన ఉంటున్నారు. ఏడేళ్ల క్రితం కాలికి వచ్చిన పుండు ఆయనను మంచాన పడేలా చేసిందని ఆయన బంధువులు చేప్తున్నారు. అది మానినా లేవలేని స్థితిలోకి వెళ్లిన అప్పారావు ఏడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. గత ఏడు నెలల క్రితం వరకు అతి కష్టం మీద ఆహారం అందించే వాళ్లమని, ఏడు నెలల నుంచి కేవలం మంచినీరు తప్ప మరేది తీసుకోలేక పోతున్నాడని అయినవారు తెలిపారు. చేనేత పైనే ఆధారపడి జీవిస్తున్న ఆ కుటుంబం భారమనుకోకుండా ఆయనను గంట గంటకు మంచినీరు ఇస్తూ కాపాడుకుంటున్నారు. ఒక కేవలం తాగునీటితో ఇన్నాళ్లుగా జీవనం సాగించడాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.


