తలుపులమ్మకు పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

తలుపులమ్మకు పంచామృతాభిషేకం

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

తుని రూరల్‌: లోవ దేవస్థానంలో కొలువైన తలుపులమ్మ అమ్మవారికి బుధవారం పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆషాఢమాసం, జన్మ నక్షత్రం కావడంతో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా 108 పంచామృత కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి అభిషేకించారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

రేపు లక్ష తులసి పూజ

ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం శుద్ధ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి లక్ష తులసి పూజ నిర్వహించనున్నట్టు డిప్యూటీ కమిషనర్‌ పి.విశ్వనాథరాజు తెలిపారు.

ముద్రగడ మృతి తీరని లోటు

ఏలేశ్వరం: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి అందరికీ తీరని లోటని వైఎస్సార్‌ సీపీ పట్టణ నాయకులు అన్నారు. ఆయన మృతికి సంతాపంగా హనుమాన్‌ జంక్షన్‌ వద్ద గల నాలుగు రోడ్ల కూడలిలో బుధవారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ముద్రగడ ఆశయాల సాధనకు కృషి చేస్తామని, ముద్రగడ గిరిబాబు నాయకత్వంలో పార్టీని ముందుకు నడిపిస్తామన్నారు. శిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, సామంతుల సూర్యకుమార్‌, సుంకర రాంబాబు, వాగు బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

కీచకుడిపై పోక్సో కేసు

కాకినాడ క్రైం: తల్లి, ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన కీచకుడు, కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన 24 ఏళ్ల గిరిపై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘాతుకంపై ఈ నెల 20న సాక్షి దినపత్రికలో ‘కీచకుడి చేతిలో విలవిల’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ప్రత్యేక చొరవతో, సమీప బంధువు అల్లాడి వీరబాబు ఫిర్యాదుతో గిరి దౌర్జన్యం బట్టబయలైంది. కలెక్టర్‌ సూచనలు, ఎస్పీ బిందుమాధవ్‌ ప్రత్యేక ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీఐ సత్యనారాయణ తెలిపారు. కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి బాధితురాలిగా పేర్కొంటున్న 14 ఏళ్ల మైనర్‌ బాలికకు వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తామన్నారు.

మినీమార్ట్‌లతో

పేదలకు ఉపయోగం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రేషన్‌ షాపులకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న మినీ మార్ట్‌ (మీ మార్ట్‌) వ్యవస్థతో రేషన్‌ డీలర్లకు ఆర్థిక భద్రత చేకూరడంతో పాటు, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ భారం గణనీయంగా తగ్గనుందని జేసీ అపూర్వ భరత్‌ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం మినీ మార్ట్‌ల ఏర్పాటు, నిర్వహణ విధి విధానాలపై సమీక్షించారు. బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు 250 రకాల నిత్యావసరాలు మినీ మార్టుల ద్వారా విక్రయించేందుకు ఆసక్తి గల డీలర్ల జాబితాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ డీఎస్‌వో లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.

దేవస్థానం సిబ్బంది

బదిలీలపై విజిలెన్స్‌ ఆరా!

అన్నవరం: దేవస్థానంలో ఉద్యోగుల బదిలీలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు ఆరా తీశారు. గత పదేళ్లుగా బదిలీ కాకుండా ఉన్న ఉద్యోగుల వివరాలు పంపించాలంటూ దేవస్థానం అధికారులను ఆదేశించారు. కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి దేవస్థానంలోనే పాతుకుపోయి, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని కొందరు ఇటీవల విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా.. ఆ మేరకు బదిలీ అయిన ఉద్యోగుల వివరాలు దేవస్థానం అధికారులు తెలియజేశారు. అలాగే పుష్కర కాలువ పక్కన గిరిప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న భూములను దేవస్థానం కొనుగోలు చేసిందా అని కూడా విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించారు. దానికి చేయలేదని సమాధానం చెప్పినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement