కాకినాడ రూరల్: అనధికార లేఅవుట్లపై కాకినాడ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (కౌడా) అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. జిల్లాలో మూడు రోజులుగా వాటిని ధ్వంసం చేసే ప్రక్రియ చేపట్టారు. బుధవారం నాటికి తొడంగి మండలం బెండపూడి, శంఖవరం మండలం కత్తిపూడి, జగ్గంపేట, పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలలో సుమారు 22 నాన్ లే అవుట్లకు సంబంధించి సుమారు 80ఎకరాలలో రోడ్లు, నిర్మాణాలు ధ్వంసం చేశారు. వాటిలో ప్లాట్ల మధ్య ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించారు. జిల్లాలో సుమారు 200కు పైగా అనధికార లే అవుట్లు ఉంటాయిని ప్రాథమిక అంచనాతో కౌడా అఽధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అనధికార లేఅవుట్ల తొలగింపు చర్యల్లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లో మూడు బృందాలను ఏపీఓలతో ఏర్పాటు చేశారు. కాగా.. కౌడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ అనధికార లేఅవుట్లలో నిర్మాణాలకు అనుమతులు మంజూరుకావన్నారు. విద్యుత్, నీరు, ప్లానింగ్ అనుమతులు లభించక కొనుగోలుదారులు నష్టపోతారన్నారు.


