తొండంగి: సముద్రంలో పెరుమాళ్లపురం వద్ద కాకినాడ గేట్ వే పోర్టు డ్రెడ్జింగ్ నిర్మాణం కారణంగా అలల ఉధృతి ఎక్కువైందని, పోర్టు ప్రాంతం నుంచి తమను వేటకు వెళ్లనివ్వాలంటూ పోర్టు ప్రతినిధులతో దానవాయిపేట పరిసర గ్రామాల మత్స్యకారులు జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. కాకినాడ గేట్ వే పోర్టును పెరుమాళ్లపురంలో నిర్మించడంతో దానవాయిపేట, నర్శిపేట, తాటియాకులపాలెం, వాడ ముసలయ్యపేట తదితర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువైందని, ఈ నేపథ్యంలో ఆయా తీరాల నుంచి బోట్లు వెళ్లేందుకు అనువుగా లేదని బాధిత గ్రామాల మత్స్యకారులు చెబుతున్నారు. ఈ మేరకు మంగళవారం పెరుమాళ్లపురంలో కాకినాడ గేట్ వే పోర్టు ప్రతినిధులతో చర్చించారు. మత్స్యకార సంఘం నాయకులతో పాటు బోట్లు యజమానులు, మత్స్యకారులు సుమారు రెండొందలమందికి పైగా పెరుమాళ్లపురం పోర్టుకు వెళ్లారు. తమకు సుమారు వంద వరకు బోట్లు వరకూ ఉన్నాయని, ఒక్కో బోటుపై ఆరు నుంచి పది మంది వరకూ వేటకు వెళతామన్నారు. పోర్టు నిర్మాణం కారణంగా తమ ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉందని, దీనివల్ల బోట్లు సముద్రంలోకి వెళ్లిన సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. పోర్టు ప్రాంతం నుంచి పెరుమాళ్లపురం మత్స్యకారులు బోట్లు వేసుకుని సులభంగా వేటకు చేసుకుంటున్నారని, తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. అయితే పోర్టులో ఎగుమతి, దిగుమతులతో పాటు అభివృద్ధికి ఇబ్బందులు కలుగుతాయని పోర్టు ప్రతినిధులు వివరించారు. అయితే తమకు మూడు నెలల పాటు వేటకు అవకాశం కల్పించాలని మత్స్యకారులు కోరారు. దీనిపై పోర్టు యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తెలుపుతామని పోర్టు ప్రతినిధులు తెలిపారు. గురువారం మరో మారు చర్చలు చేస్తామని బదులిచ్చారు.
ఫ కాకినాడ గేట్‌వే పోర్టు ప్రతినిధులతో
మత్స్యకారుల చర్చలు
ఫ అంగీకరించని పోర్టు ప్రతినిధులు


