పిఠాపురం రూరల్: యు.కొత్తపల్లి మండలం మూలపేటలో రెండు రోజుల క్రితం కాదా రాకేష్ (28) హత్యకు గురయ్యాడు. ఆ మృతదేహం ఉంచిన వాహనంతో మృతుడి బంధువులు, ఎమ్మార్పీస్ సంఘాల ప్రతినిధులు పిఠాపురం ప్రభుత్వాసుపత్రి మార్చురీ గేటు ఎదుట రోడ్డుపై శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తొలుత పిఠాపురం పాడా కార్యాలయంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను కలసి వినతిపత్రం అందించారు. కలెక్టర్‌ను కలసినా తమకు సరైన హామీ లభించలేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మృతుడి భార్య మాట్లాడుతూ తన భర్తను కొంతమంది అన్యాయంగా చంపేశారని, దీంతో తమ కుటుంబానికి ఆసరా లేకపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.


