● టెన్త్‌లో 3,942 మంది ఫెయిల్
● సైన్స్, మ్యాథ్స్, సోషల్‌లోనే
ఎక్కువ మంది వెనుకబాటు
● అమ్మ భాషలోనూ అపజయమే
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి ఫలితాలను విశ్లేషిస్తే మన విద్యా వ్యవస్థలోని డొల్లతనం బయట పడక మానదు. ప్రత్యేక తరగతులు, వంద రోజుల ప్రణాళిక అంటూ ఎంత హడావుడి చేసినా ఎక్కువ మంది విద్యార్థులు మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలయ్యారు. చివరకు అమ్మ భాష అయిన తెలుగులో సైతం తక్కువ మార్కులే పొందారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు. చదవలేని, రాయలేని స్థితిలో చాలా మంది విద్యార్థులున్నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఫెయిలైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యా ప్రమాణాలు పతనమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
కారణమేమిటో!
గత నెలలో విడుదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా 3,942 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వీరిలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వారు 458 మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతమంది విద్యార్థులు ఎందుకు వెనుకబడ్డారనే అంశం విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారింది. సరైన పర్యవేక్షణ లేకపోవడమా లేక బోధనా పద్ధతుల్లో లోపమా అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు సైన్స్, గణితం, సోషల్, తెలుగు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన లేకపోవడమే విద్యార్థులు ఫెయిలవడానికి ప్రధాన కారణమని, బట్టీ పట్టే పద్ధతికి అలవాటు పడటంతో అప్లికేషన్ మెథడ్ ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయారని విద్యావేత్తలు చెబుతున్నారు. చివరకు అమ్మ భాషలో సైతం ఎక్కువ మంది ఉత్తీర్ణులు కాలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్షర దోషాలు లేకుండా తెలుగులో రాయలేకపోవడం, వాక్య నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో భాషా సబ్జెక్టుల్లో మార్కులు తగ్గుతున్నాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే మెరుగైన సౌకర్యాలు, ట్యూషన్ సెంటర్లు ఉండే పట్టణ ప్రాంతాల్లోనే విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించారు. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండటం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో పట్టణ ప్రాంత విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ విద్యా రంగం తిరోగమనంలో పయనిస్తోందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ఇంత మంది విద్యార్థులు ఫెయిలవడానికి మూలకారణాలను ఇప్పుడైనా సరిగ్గా గుర్తించి, సరి చేయకుంటే ప్రభుత్వ విద్యా రంగం మరింత అధోగతి పాలయ్యే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు.
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్)


