● జనసేన నాయకుడిపై కోడలి ఆరోపణ
● కుమార్తెతో కలిసి పాడా కార్యాలయం
ఎదుట నిరసన
పిఠాపురం రూరల్ : తనకు రావాల్సిన ఆస్తి అడుగుతుంటే తన మామ, జనసేన నాయకుడు అయిన గరగ సత్యానందం వేధింపులకు గురి చేస్తున్నారని పిఠాపురం మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి ఆరోపించారు. తనకు న్యాయం కావాలని, తన కుమార్తెతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా తనకు రావలసిన ఆస్తి హక్కులను కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త గరగ జగన్నాథ్ 2021లో కోవిడ్తో మరణించారని, భర్త మరణానంతరం తనను మానసికంగా, ఆర్థికంగా మామ సత్యానందం వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన పిఠాపురం జనసేన నాయకుడు కావడంతో జనసేన కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కుమార్తెను పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కృష్ణ స్వాతి తెలిపారు. భర్త చనిపోయిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, మామగారే కదా అని నమ్మి సంతకం పెట్టానని, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు. స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా మామ సత్యానందానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, చేబ్రోలులోని పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశానని, హైదరాబాద్లో పవన్ నివాసానికి రెండుసార్లు వెళ్లానని అయినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన చిన్న కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.
వినతి పత్రం ఇస్తామంటే
8 గంటలు నిర్బంధించారు
– ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆవేదన
తుని రూరల్: విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడికి వినతి పత్రం ఇస్తామంటే తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు, సహాయ కార్యదర్శి సీహెచ్ లోవరాజు, ఎం.గంగాసూరిబాబు, పి.సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎంను కలసి వినతి పత్రం అందించేందుకు పోలీసులను అనుమతి కోరామన్నారు. అందుకు అంగీకరించని పెద్దాపురం డీఏస్పీ ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడం దుర్మార్గమని, రాజ్యాంగ విరుద్దమన్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, కోటనందూరు, తొండంగి, రౌతులపూడి, ప్రత్తిపాడు, యు.కొత్తపల్లి, పెదపూడి మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదికవి నన్నయ్య పీజీ సెంటర్‌ను కాకినాడలో మినీ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసి అన్ని కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. తుని, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాలలో పీజీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంవత్సరం మొత్తానికి బస్‌పాసులు జారీ చేయాలన్నారు.


