కె–ట్యాక్స్‌ పేరిట టీడీపీ నేతల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

కె–ట్యాక్స్‌ పేరిట టీడీపీ నేతల దోపిడీ

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో కె–ట్యాక్స్‌ పేరిట టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ మాజీ కార్పొరేటర్‌ ఎంజీకే కిషోర్‌ ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ సిటీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చిన్న క్రీడా మైదానం చదును చేయడానికి సంబంధించి రూ.93 లక్షలకు టెండర్‌ మంజూరు కాగా ఇందులో రూ.50 లక్షల గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు. ఈ సొమ్ము, కె–ట్యాక్స్‌ సొమ్మంతా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు వెళ్తోందని ఆరోపించారు. ఈ విధంగా నెలకు రూ.1.14 కోట్ల అవినీతి సొమ్ము చేరుతోందన్నారు. నగరంలోని మద్యం షాపుల ద్వారా ప్రతి బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారని, ఆశీలు పాట ద్వారా కె–ట్యాక్స్‌, రేషన్‌ బియ్యం కొనుగోలు, జూదం నంబర్‌ గేమ్‌లు ఆడించడం, సరకు రవాణా బార్జీకి ఉచితంగా చేసే రెన్యువల్‌కు రూ.లక్ష వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్నాథపురంలోని ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ క్రీడా స్థలాన్ని తమ హయాంలో ఉచితంగా చదును చేశామని చెప్పారు. పాత ఇంటికి సంబంధించి మట్టితో అక్కడ ప్లాస్టిక్‌ కవర్లు వచ్చాయన్నారు. అంతే కానీ ఆ మట్టి చెత్తాచెదారాలకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. దీనిపై తమ స్థానిక నాయకులు అప్పటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పారని, ఈలోగా ఎన్నికలు రావడంతో అది చేయలేకపోయామని తెలిపారు. ఉచితంగా చదును చేయాల్సిన క్రీడా మైదానానికి టెండర్‌ పిలిపించి, రూ.93 లక్షలు మంజూరు చేశారని, అందులో రూ.50 లక్షలు చేతులు మారాయని కిషోర్‌ ఆరోపించారు. జగన్నాథపురం చిన్న మార్కెట్లో తాను కొన్ని దుకాణాలు తీసుకున్నానని, వాటిని తన అనుచరులకిచ్చి వ్యాపారం సాగిస్తున్నామని అంటూ తనపై అక్కడి స్థానిక నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అక్కడ ఐదు దుకాణాలను వివిధ కారణాలతో చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకిచ్చి ఆదుకున్నామని కిషోర్‌ చెప్పారు. తన పైన, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పైన ఆధారాలు లేని ఆరోపణలు చేసి, అభాసు పాలు కావద్దని స్థానిక టీడీపీ నాయకులకు హితవు పలికారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు చక్క చక్రవర్తి, వాసిరెడ్డి చిన్ని, పృథ్వి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement