పూడికతీత.. అవినీతి మేట! | - | Sakshi
Sakshi News home page

పూడికతీత.. అవినీతి మేట!

May 2 2026 8:08 AM | Updated on May 2 2026 8:08 AM

వెంకన్నదొర చెరువుకు గర్భశోకం

యథేచ్ఛగా తవ్వేస్తోన్న ‘తమ్ముళ్లు’

ఇటుక బట్టీలకు అమ్మకాలు

చెరువు గర్భంలో మట్టిని తవ్వుతున్న పొక్లెయిన్లు, లోడింగ్‌కు వచ్చిన లారీలు (వృత్తంలో)

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ నేతలు పూడికతీత పేరుతో చెరువు గర్భంలో మట్టి కొల్లగొట్టేసి రూ.లక్షలు మింగేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అతి పెద్ద చెరువుల్లో వెంకన్నదొర చెరువు ఒకటి. ఒకప్పుడు పక్షుల కిలకిలారావాలతో, జల కళతో అలరారిన ’వెంకన్నదొర చెరువు’ తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు కాసులు కురిపిస్తోంది. ఏటా మధ్య ఆసియా, మంగోలియా ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ పక్షులకు వెంకన్నదొర చెరువు స్వర్గధామం. రెండు, మూడు నెలలు ఇక్కడ విడిది చేసే విదేశీ పక్షుల మనుగడకు తెలుగుతమ్ముళ్ల అక్రమ మట్టి దందా ముప్పుగా పరిణమించింది. వెంకన్నదొర చెరువు పెదశంకర్లపూడి, పి జగన్నాథపురం, ఏలూరు, లంపకలోవ, ప్రత్తిపాడు ప్రాంతాల్లో ఆయకట్టుకు సాగునీరందిస్తోంది. నీటి నిల్వల పెంపు పేరుతో పూడికతీతకు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇక్కడ చెరువులో తవ్వే మట్టిని రైతులు పల్లంగా ఉన్న తమ పొలాలను మెరక చేసుకునేందుకు వినియోగించాలి. అందుకు భిన్నంగా తెలుగు తమ్ముళ్లు ఇటుక బట్టీలకు అమ్మేస్తున్నారు. నాలుగైదు రోజులుగా పగలు, రాత్రీ మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

20 టిప్పర్లు.. 300 ట్రిప్పులు

సుమారు 1,200 ఎకరాల మెట్ట భూములకు సాగునీరందించే ఈ చెరువులో నీటిని తెలుగు తమ్ముళ్ల మట్టి దందా కోసం బయటకు తోడేశారు. రాచబాట వేసి మరీ అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పెదశంకర్లపూడిలో ఉన్న ఈ చెరువు మట్టిని తవ్వి తరలించేందుకు ట్రిప్పుకు రూ.5,000 తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి అదనంగా రూ.1,000 దండుకుంటున్నారు. ఇక్కడి చెరువులో యంత్రాలతో తవ్విన మట్టిని 20 టిప్పర్లు అహోరాత్రులు తరలిస్తున్నాయి. టిప్పరు 15 ట్రిప్పుల వంతున రోజుకు మొత్తంగా 300 ట్రిప్పులకు పైనే అక్రమ మట్టి తరలిపోతోంది. ప్రత్తిపాడు, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు.

తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే..

జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేతలకు సన్నిహితులైన ఇద్దరు అనుచరుల కనుసన్నల్లోనే చెరువులో మట్టి దందా నడుస్తోంది. పొరుగు నియోజకవర్గ నేతల అనుచరులు తమ నియోజకవర్గంలోకి చొరబడి ఇష్టారాజ్యంగా మట్టి తవ్వేస్తుండటాన్ని ప్రత్తిపాడులోని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తవ్వకాలపై ఉన్నతాధికారులకు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారని సమాచారం. రైతుల ప్రయోజనాన్ని గాలికొదిలేసి వెంకన్నదొర చెరువులో జరుగుతోన్న మట్టి మాఫియాపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement