● తడిసిన ధాన్యం రాశులు
● కొనుగోలు కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం
పిఠాపురం: ప్రతి గింజా కొంటాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం అంటూ అధికారులు చేసిన ప్రకటనలు, ప్రచారాలు వట్టివేనని తేలిపోయింది. అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రబీ కోతలు పూర్తి కాగా 70 శాతంకు పైగా ధాన్యం ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేశారు. అక్కడక్కడా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నప్పటికి నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనకుండా నిలిపివేసి ప్రైవేటు వ్యాపారుల కొమ్ము కాస్తున్నారని సిబ్బందిపై రైతులు మండిపడుతున్నారు.
ఒక్క గింజా కొనలేదు
గొల్లప్రోలు మండలం మల్లవరంలో రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు ఒక్క గింజకూడా కొనకపోవంతో తీవ్ర నష్టాలు పాలయ్యామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో పది రోజులుగా రైతులు తమ ధాన్యంను కళ్లాల్లోనే వదిలేయాల్సి వచ్చింది. అధికారుల సూచనల మేరకు ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబెట్టినట్లు రైతులు చెబుతున్నారు. అయితే మల్లవరంలో ధాన్యం కొనుగోలు చేయాల్సిన వీఏఏ పది రోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శుక్రవారం వచ్చిన అకాల వర్షం మొత్తం ధాన్యం తడిపేసిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కేవలం మల్లవరంలోనే 700 ఎకరాల్లో పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకే ఈ నష్టాలు సంభవించాయని, దీనికి వీఏఏపై చర్యలు తీసుకుని, తమకు నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పరిహారం ఇవ్వాలి
మల్లవరంలో రబీ కోతలు ప్రారంభమై నెల రోజులు దాటింది. ఇక్కడి వీఏఏ ఆన్‌లైన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో పంటను అమ్ముకునే దారిలేక, వర్షంలో తడిసి రైతల నష్టాల పాలయ్యారు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– అరిగెల అచ్చియ్యమ్మ రామయ్యదొర,
మాజీ ఎంపీపీ, గొల్లప్రోలు మండలం


