పేదల సొంతింటి కలను చిదిమేసిన చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కలను చిదిమేసిన చంద్రబాబు

May 2 2026 8:08 AM | Updated on May 2 2026 8:08 AM

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం

రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి

కాకినాడ రూరల్‌: పేదవాడి సొంతింటి కలను చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా చిదిమేసిందని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షలకు మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి స్థలాలను కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలోని ఆర్‌ 5 జోన్‌లో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను సీఆర్డీఏ పరిధిలోకి విలీనం చేయడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను బలవంతంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలుసేనని పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది పేదలు వారికి కేటాయించిన ఇంటి స్థలాలు కోల్పోతున్నారని తెలిపారు. మెడికల్‌ కాలేజీల నిర్వహణకు, ఆరోగ్య నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నిధులు ఇవ్వని ప్రభుత్వం అమరావతి రాజధానిపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అమరావతిలో పలు కట్టడాలకు గ్లాస్‌ ఫినిషింగ్‌ చేసేందుకు రూ.2,540 కోట్లు మంజూరు చేయడాన్ని ఆక్షేపించారు.

కాకినాడ–మైసూర్‌ రైలు ప్రారంభం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రైల్వే శాఖ నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ – మైసూర్‌ ట్రైన్‌ను శుక్రవారం కాకినాడ టౌన్‌ రైల్వేస్టేషన్లో ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రత్యేక సర్వీస్‌గా నడుస్తున్న ఈ రైలు ఇకపై సోమవారం, శుక్రవారం కాకినాడలో ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందన్నారు. అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా కాకినాడ, తుని, సామర్లకోట రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశామన్నారు.

జిల్లా దేవదాయశాఖాధికారిగా

వేంకటేశ్వరరావు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయశాఖాధికారిగా వర్థినీడి వేంకటేశ్వరరావు శుక్రవారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను పదోన్నతిపై కాకినాడ జిల్లా దేవదాయశాఖాధికారిగా నియమించారు. మార్చి నెలాఖరున జిల్లా దేవదాయశాఖాధికారిగా పనిచేసిన కనపర్తి నాగేశ్వరావు పదవీ విరమణ చేయడంతో తలాటం వెంకటసూర్యనారాయణను నియమించారు. నెల రోజుల వ్యవధిలోనే ఆయన స్థానంలో వేంకటేశ్వరావును నియమించడం దేవదాయశాఖలో చర్చాంశనీయమైంది. బాధ్యతలు స్వీకరించిన వేంకటేశ్వర్రావు పలు ఈవోలు, ఆలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

4, 5 తేదీలలో ప్రత్యేక రైళ్లు

రాజమహేంద్రవరం సిటీ: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4, 5 తేదీలలో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ టౌన్‌– లింగంపల్లి (07703)మధ్య, 5వ తేదీన లింగంపల్లి– కాకినాడ టౌన్‌ (07704) మధ్య రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement