యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు | - | Sakshi
Sakshi News home page

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

May 2 2026 8:08 AM | Updated on May 2 2026 8:08 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో తుపానులు, వరదలు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం తుపానులు, వరదలు ఇతర విపత్తుల సమయంలో చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి సన్నద్ధతపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. జిల్లాలో తుపానులు ఇతర ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాల దృష్ట్యా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, విపత్తుల అనంతరం పునరుద్ధరణ చర్యలపై కలెక్టర్‌ అధికారులతో చర్చించారు.

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ

రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలని, రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రబీ సీజన్‌ పంట కోతలు, ధాన్యం సేకరణపై కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రబీ సీజన్‌లో ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా కొనుగోలు కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇప్పటి వరకూ 1.15 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయని సుమారు 60 వేల మెట్రిక్‌ ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement