దేవీపట్నం: అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం ఇందుకూరుపేట పరిసర గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీని కారణంగా రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్న కళ్లాలు తడిసిపోయాయి. మామిడి కాయల దింపు ఊపందుకున్న తరుణంలో కోసిన మామిడిని ఒబ్బిడి చేసేందుకు రైతులు నానా హైరానా పడ్డారు. మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉండే సూచనలు కనిపిస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


