పట్టాభిషేకానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పట్టాభిషేకానికి సిద్ధం

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

నేడు జేఎన్‌టీయూకే 12వ స్నాతకోత్సవం

హాజరుకానున్న వర్సిటీ కులపతి,

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీటెక్‌ నాలుగేళ్లు, ఎంటెక్‌ రెండేళ్లు చదివినవారికి యూనివర్సిటీ అందజేసే పట్టాల వేడుకలకు జేఎన్‌టీయూ కాకినాడ వేదిక అవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న వారికి సైతం పట్టా అందుకోవడానికి ఆహ్వానాలు పంపారు. అతిరథ మహారథుల చేతుల మీదుగా స్నాతకోత్సవ సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు పట్టా (ఒరిజనల్‌ డిగ్రీ) తీసుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీవితంలో మధురానుభూతిగా నిలిచే ఈ వేడుకలకు అర్హులైనవారు తమ వివరాలు వర్సిటీకి పంపించారు. గత ఏడాది డిసెంబర్‌లో స్నాతకోత్సవానికి నోటిఫికేషన్‌ జారీచేసి గవర్నర్‌ అనుమతితో గురువారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు వర్సిటీ వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తెలిపారు. 12వ స్నాతకోత్సవంలో భాగంగా 2024–25 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైనవారికి పట్టాలు అందజేస్తున్నారు. బీటెక్‌ విభాగంలో 32,170, బిఫార్మశీ 1,450, ఎంటెక్‌ 679, ఎంబీఏ 1,326, ఎంసీఏ 1,115, ఎంఫార్మశీ 116, బీబీఏ 28, ఫార్మడీ 944, బీఆర్క్‌ 70 ఓడీలు (ఒరిజనల్‌ డిగ్రీ) విద్యార్థులు పొందనున్నారు. వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ చూపిన 39 మందికి బంగారు పతకాలు, 48 మందికి పీహెచ్‌డీలు అందజేయనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా డిజిటల్‌ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో విద్యార్థుల ఓడీలను వారికి చెందిన డీజీ లాకర్‌లో భద్రపరిచే విధానాన్ని గవర్నర్‌ చేతుల మీదుగా రాష్ట్రంలో తొలిసారిగా యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నారు.

శాంత బయోటెక్‌ అధినేత

వరప్రసాద్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్‌

స్నాతకోత్సవం సందర్భంగా శాంతా బయోటెక్‌ అధినేత, పద్మభూషణ్‌ డాక్టర్‌ కే.ఐ.వరప్రసాద్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేస్తున్నారు. 1948 నవంబర్‌ 17న నెల్లూరు జిల్లాలో జన్మించిన ఈయన శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన తరువాఈ జేఎన్‌టీయూకేలో ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ, జర్మనీలో కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లమా చేశారు. 1993లో తన తల్లి శాంతమ్మ పేరుతో శాంత బయోటెక్‌ ప్రారంభించి ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వంటి దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించారు. హైపటైటిస్‌ బీ–టీకా వంటి ప్రాణరక్షణ టీకాలను తక్కువ ఖర్చుకే అందించేలా కృషి చేశారు. భారతీయులకు టీకాను అందుబాటు ధరలోకి తీసుకువచ్చారు. ప్రజారోగ్య రంగాలకు ఆయన చేసిన సేవలకు 2005లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. దేశంలో పేరొందిన యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్‌లతోపాటు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును బయోటెక్‌ రంగంలో ఆయన సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement