బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రెండేళ్లు గడిచినా చంద్రబాబు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించ లేదని యూటీఎఫ్ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణకుమారి అన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బుధవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రణభేరి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పీఆర్‌సీ కమిషన్‌ను నియమించడం లేదని, ఐఆర్ ప్రకటించడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడం లేదన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ సూరిబాబు, కేవీపీ నగేష్‌బాబు మాట్లాడుతూ హైస్కూల్‌లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను చాలా చులకనగా చూస్తున్నారన్నారు. రేషనలైజేషన్ పేరుతో వేలాది పోస్టులు తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి తమ హామీలను నెరవేర్చే వరకూ ఈ పోరాటం ఆగదన్నారు. అసోసియేషన్ నాయకులు గోవిందరాజులు, నాగమణి, పీవీ సత్యనారాయణ, వీవీ రమణ, జి నాగరాజు, జి ప్రభాకరవర్మ పాల్గొన్నారు.
యూటీఎఫ్ జాతీయ
ఉపాధ్యక్షురాలు అరుణకుమారి


