అధినేతతో ఆత్మీయ కలయిక | - | Sakshi
Sakshi News home page

అధినేతతో ఆత్మీయ కలయిక

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

పిఠాపురం: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో బుధవారం పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యురాలు, మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వంగా గీతా విశ్వనాథ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు.

అందరి సహకారంతో

జిల్లా అభివృద్ధి

కొత్త కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ అన్నారు. జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ తన కార్యాలయ చాంబర్‌లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన విశాఖపట్టణం నుంచి అన్నవరం చేరుకుని రమా సత్యనారాయణస్వామివారిని దర్శించి, అర్చన, ఆశీర్వాద కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు కాకినాడ జిల్లా కలెక్టరు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జేసీ అపూర్వ భరత్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మనీషా, డీఆర్వో డి.తిప్పేనాయక్‌, జిల్లా అధికారులు, వేద పండితులు పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. కలెక్టర్‌ చాంబర్‌లో ఆయన పదవీ బాధ్యతలు చేపడుతూ సంతకం చేసి, పండితుల వేదస్వస్తి, ఆశీర్వచనాలను స్వీకరించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విశాఖపట్నంలో కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేసిన అనుభవంతో కాకినాడ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

అన్నవరం దేవస్థానం

బడ్జెట్‌ రూ.179.71 కోట్లు

అన్నవరం: అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 179,71,20,000 బడ్జెట్‌ను ఆమోదిస్తూ దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ బడ్జెట్‌లో సిబ్బంది జీతభత్యాలకు రూ.33.50 కోట్లు, పింఛన్లు, గ్రాట్యుటీకి రూ.15 కోట్లు, కొనుగోళ్లకు రూ.33.20 కోట్లు, ఉత్సవాలకు రూ.1.50 కోట్లు, పురోహితుల రెమ్యునరేషన్‌ రూ.16.80 కోట్లు, ప్రసాదం ప్యాకర్లు, బార్బర్స్‌ రెమ్యునరేషన్‌ రూ.4.70 కోట్లు, శానిటేషన్‌కు రూ.పది కోట్లు, వాటర్‌ వర్క్స్‌ కు రూ.2.5 కోట్లు, భద్రతా సిబ్బందికి రూ.5.50 కోట్లు, శాట్యుటరీ పేమెంట్స్‌కు రూ.20 కోట్లు, ఇంజినీరింగ్‌ వర్క్స్‌ కు రూ. ఏడు కోట్లు, అన్నదాన పథకానికి రూ.5.5 కోట్లు, గో సంరక్షణకు రూ.75 లక్షలు కేటాయించారు.

2025–26లో రాబడి రూ.157.54 కోట్లు

2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆలయానికి రూ.157.54 కోట్ల రాబడి వచ్చినట్లు ఈఓ త్రినాథరావు తెలిపారు. గతేడాదికన్నా సుమారు రూ.తొమ్మిది కోట్లు పెరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement