అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీసీతారాముల దివ్య కల్యాణ మహోత్సవాలలో భాగంగా ఏడో రోజు బుధవారం సీతారాముల వన విహారోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి వెంట రాగా నవ దంపతులు సీతారాములను ఊరేగింపుగా కొండదిగువన దేవస్థానం ఉద్యానవనం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక సింహాసనంపై నవదంపతులు, సీతారాములను, మరో ఆసనం మీద పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రతిష్ఠించి పండితులు పూజలు చేశారు. నవదంపతులకు నూతన పట్టువస్త్రాలను దేవస్థానం అధికారులు అందజేశారు. విఘ్నేశ్వరపూజ, తదితర కార్యక్రమాలనంతరం అర్చకస్వాములు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించగా, పండితులు వేదాశీస్సులు అందజేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
నేడు చక్రస్నానం
ఉత్సవాల ఎనిమిదో రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పవర్‌హౌస్ వద్ద గల పంపా నది వద్ద సీతారాములకు చక్రస్నానం నిర్వహించనున్నట్లు పండితులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రామాలయంలో నాకబలి, దండియాడింపు నిర్వహిస్తారు.


