బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): డీసీసీబీని లాభాల బాటలో నడిపించేలా సహకార సంఘాల అధ్యక్షులు కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ 131వ మహాజన సభ సోమవారం స్థానిక జీ కన్వెన్షన్ హాల్లో జరిగింది. అధికారులు బినానీ రుణాలు ఇస్తే దానికి సహకార సంఘ అధ్యక్షులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. నా బార్డు రుణాలు ఇవ్వడం లేదని కేవలం ఆప్కాబ్ ఇచ్చే రుణాలు రైతులకు ఇస్తున్నామన్నారు. డీసీసీబీలో 298 సహకార సంఘాలు ఉండగా వీటిలో 263 సంఘాల్లో ఓవర్ డ్యూలు పెరిగిపోయాయన్నారు. వీటిలో రూ.939 కోట్ల ఓవర్ డ్యూ ఉందన్నారు. ఓవర్ డ్యూలు ఉంటే ఆప్కాబ్ కూడా అప్పులు ఇవ్వడం మానివేస్తుందన్నారు. డీసీసీబీ ఇన్‌చార్జ్ సీఈఓ ప్రవీణ్ కుమార్ అజెండాలోని అంశాలను వివరించగా సొసైటీల అధ్యక్షులు సమ సందేహాలను తీర్చాలని పట్టుబట్టారు. సహకార సంఘాల్లో బినామీ పేరుతో భూములు కూడా లేకుండా రుణాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ రుణాలు తాము రికవరీ చేయలేకపోతున్నామని పలువురు సహకార సంఘం అధ్యక్షులు వాపోయారు. ఈ రుణాలు ఇచ్చే విషయంలో అధికారులు పాత్ర కూడా ఉందని మండిపడ్డారు.


