పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువైయున్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుంచి స్వామి వారి దర్శనానికి రావడంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారి తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. సుమారు 35 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి, స్వామివారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,39,875, అన్నదాన విరాళాలు రూ.84,972, కేశఖండన ద్వారా రూ.6,760, తులాభారం ద్వారా రూ.550, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.22,095 కలిపి మొత్తం రూ.3,54,147 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. ఏడు వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. భక్తులకు గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు సేవలందించారు.


