కాకినాడ రూరల్: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హెచ్చరించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ పోర్ట్ ఏరియాలో బియ్యం గోదాములు, చెక్ పోస్టులను శనివారం ఆయన తనిఖీ చేశారు. పోర్టు ఏరియాలోని మొత్తం 29 గోదాములను ఆయన తనిఖీ చేశారు. తొలుత బొంబాయి కాటా వద్ద ఉన్న చెక్‌పోస్టును, గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం స్టాక్ వివరాలు, రవాణా రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా అధికారులు నిఘా ఉంచాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మురం చేశామని, గోదాముల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని అన్నారు. దాడుల్లో ఆర్‌డీఓ మల్లిబాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవులా నాయక్ తదితరులు పాల్గొన్నారు.


