అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాజకీయాల్లో సీట్లు, ఓట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని మాజీ శాసనసభ ఉప సభాపతి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ‘మహాపురుషుడు మండలి’ నాటకంతో పాటు ఆంధ్ర విశ్వ విద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డాక్టర్ కె.మలయవాసినికి దంటు భాస్కరరావు జీవిత సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమంలో ఆయన శనివారం గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివిసీమ గాంధీగా పేరొందిన తన తండ్రి, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు సాధారణ కార్యకర్తగా, ఎన్నికలకు డిపాజిట్ కట్టలేని పరిస్థితిలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరావు పిలిచి మరీ బందరు టికెట్టు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, నేడు ప్రజాస్వామ్యంలో సీట్లు, ఓట్లు కొనుక్కోవాల్సి రావడం బాధాకరమని అన్నారు. తాను నాలుగోసారి ఎమ్మెల్యేనయ్యానని, ఈ విషయంలో ప్రతి రోజూ బాధ పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష, సాహిత్యానికి విశేష కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయలు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. రాజరాజ నరేంద్రుడు తన పాలనలో రాజ్యంలో అశాంతి ఉన్నప్పటికీ తెలుగు భాష అభ్యున్నతికి పాటు పడ్డారని బుద్ధప్రసాద్ చెప్పారు.


