సుమ సౌందర్యం: గుత్తులుగా విరబూసిన తెలుపు రంగు ఆర్కిడ్‌లు
కలర్‌ఫుల్‌గా..: ఆకర్షించే రంగుల్లో ఆర్కిడ్‌లు
● అనువుగానిచోట ఆర్కిడ్స్ సాగు
● నర్సింగపురంలో యువ రైతు ప్రయోగం
● గుబాళిస్తున్న బ్యాంకాక్ సుమాలు
● విరబూస్తున్న లాభాలు
పిఠాపురం మండలం నర్సింగపురం గ్రామానికి చెందిన జవ్వాది వీరబాబు పదో తరగతి వరకూ చదువుకున్నాడు. ప్లంబింగ్ పనులు చేస్తూంటాడు. వస్తున్న ఆదాయంతో బతుకు బండి సాఫీగా సాగడం లేదు. దీంతో, కాస్త విభిన్నంగా ఆలోచించాడు. తనకున్న మూడెకరాల పొలంలో అరుదైన పూలు సాగు చేయాలని సంకల్పించాడు. పెళ్లి వేదికలకు వినూత్న శోభను అద్దే ఆర్కిడ్స్ పుష్పాలపై అతడి దృష్టి పడింది. వాటి గురించి ఆరా తీశాడు. ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాడు. సలహాలు, సూచనలు తీసుకున్నాడు. తెలిసిన స్నేహితుల ద్వారా ఆర్కిడ్స్ మొక్కలు కొనుగోలు చేశాడు. అక్కడితో ఆగలేదు. ఏకంగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచే పూల మొక్కలు తెప్పించాడు. తన పొలంలో అరెకరంలో పాలీహౌస్ నిర్మించాడు. దానిలో ప్రత్యేక వాతావరణంలో రకరకాల ఆర్కిడ్స్ సాగు నాలుగేళ్ల క్రితం ప్రారంభించాడు. వీటి సాగు మొదలు పెట్టిన ఏడాది నుంచే కోతకు రావడంతో పూల వ్యాపారం మూడు పువ్వులు ఆరు పుష్పగుచ్ఛాలుగా విరాజిల్లుతోంది.
ఖరీదైన వ్యవహారం
సాధారణంగా మనం నిత్యం వాడటానికి రకరకాల పుష్పాలు వాడుతూంటాం. కానీ, సౌకుమార్యం, అందం, సౌరభం కలబోసిన ఆకర్షణీయమైన పూలనిచ్చే మొక్కలు ఆర్కిడ్స్. వీటిని ఎక్కువగా శుభకార్యాల్లో వేదికల అలంకరణకు వాడుతూంటారు. ఆర్కిడ్స్ పూల ఉత్పత్తిలో థాయ్‌లాండ్ అగ్రగామిగా ఉంది. ఇక్కడి నుంచే అధిక శాతం పూలు మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. మన దేశంలో ఆర్కిడ్స్ సాగులో మహారాష్ట్ర ముందంజలో ఉంది. మన ప్రాంతాల్లో వ్యాపారపరంగా ఆర్కిడ్స్ సాగు అరుదే. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. అధిక తేమతో కూడిన వాతావరణం కావాలి. అందుకే సాధారణంగా వీటిని పాలీహౌస్‌లోనే పెంచుతూంటారు. విస్తీర్ణాన్ని బట్టి ఈ పాలీహౌస్ ఏర్పాటు, మొక్కల కొనుగోలుకే ఏకంగా రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ఖర్చవుతుంది. అందుకే సంపన్న రైతులు సైతం వీటి పెంపకానికి వెనుకాడుతూంటారు. కానీ, వీరబాబు మాత్రం ‘తగ్గేదేలే.. అన్నాడు. ఖరీదైన ఈ పుష్పాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. ఆర్కిడ్స్‌లో ఎన్నో రకాలున్నాయి. వీరబాబు లిల్లీ జాతికి చెందిన ఏషియాటిక్ లిల్లీ పూలను సాగు చేస్తున్నాడు.
గాలిలో పెంపకం
ఆర్కిడ్స్ సాగు ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఈ మొక్క మట్టిలో పెరగదు. బ్యాంకాక్ నుంచి ట్రేలలో వచ్చిన మొక్కలను మూడంగుళాల కుండీల్లోకి మారుస్తారు. ఆ కుండీలో మట్టి లేకుండా బొగ్గు, గులకరాయి, కంకర, లోహపు రాళ్లను వాడుతూంటారు. వీటి కంటే కొబ్బరి డొక్కల్లో ఎక్కువ ఫలితాలు వస్తున్నట్లు గమనించారు. దీంతో, ప్రస్తుతం కొబ్బరి డొక్కల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు. కొబ్బరి డొక్కను చీల్చి నీటిలో నానబెడతారు. వాటిని కుండీల్లో పెట్టి, మొక్కలు నాటుతారు. అనంతరం, ఆ కుండీలను ప్రత్యేకంగా తయారు చేసిన బెడ్‌లపై వరుసగా పేర్చుతారు. అవి పెరుగుతూ వాటి వేర్లు బెడ్‌ల నుంచి కిందకు గాల్లో వేలాడుతూంటాయి. ఈ క్రమంలో గాలిలో తేమను ఆ మొక్కలు పీల్చుకుంటాయి. దీనివలన పువ్వులు బాగా తయారవుతాయి.
చూస్తే ఫిదా కావాల్సిందే..:
పసుపు రంగు ఆర్కిడ్‌లు
ఆదాయానికి తగ్గట్టుగానే పెట్టుబడి
ఒక్కో మొక్క రూ.60 చొప్పున బ్యాంకాక్ నుంచి 60 వేల మొక్కలు తెప్పించాను. వీటికి ఎండ వేడి తగలకూడదు. తేమ అధికంగా ఉండాలి. దీనికోసం అరెకరంలో సన్‌షేడ్‌లు నిర్మించి, ఈ మొక్కలు నాటాను. మొత్తం రూ.40 లక్షల వరకూ పెట్టుబడి అయ్యింది. రెండో దఫా గత ఏడాది నాటగా ప్రస్తుతం పూలు కోతకు వచ్చాయి. ప్రతి నెలా మంచి దిగుబడి వస్తోంది. పెట్టుబడికి తగినట్టుగానే ఆదాయం కూడా వస్తోంది. వస్తున్న పూలను స్థానిక వ్యాపారులతో పాటు బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఆర్డర్లపై విక్రయిస్తున్నాను. తెలుపు, పసుపు, ఎరుపు రంగు పూలు సాగు చేశాను. వీటికే మంచి గిరాకీ ఉంది. – జవ్వాది వీరబాబు
ధైర్యంతో విజయం సాధించారు
నర్సింగపురంలో ఆర్కిడ్స్ సాగు ఆశాజనకంగా ఉంది. వీరబాబు ధైర్యం చేసి వీటి సాగు ప్రారంభించగా, మా సలహాలతో మంచి దిగుబడులు సాధిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈ పూలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ప్రతి శుభకార్యంలోను వీటికి ప్రాధాన్యం ఇస్తూండటంతో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వ్యాపారం బాగుంది. మరింత మంది రైతులు ముందుకు వచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం.
– వై.సోమరాజశేఖర్, ఉద్యాన శాఖాధికారి, పిఠాపురం


