దూరమైన విద్య
● దూరవిద్య కేంద్రాలకు ఏయూ మంగళం
● కాకినాడ, రాజమహేంద్రవరంలోని
స్టడీ సెంటర్ల మూసివేత
● విద్యార్థి నేతల ఆగ్రహం
● వీటిని కొనసాగించాలని డిమాండ్
● లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): చదువుకోవాలనే ఆశ ఉన్నా.. కుటుంబ పరిస్థితులు అనుకూలించనందువల్లనో.. ఇతర కారణాలతోనో ఉన్నత విద్య అభ్యసించలేకపోయిన వారికి.. డిగ్రీ చదువును చేరువ చేసి, పట్టాలు అందించిన ఘనత ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) దూరవిద్యా కేంద్రానిది. కేవలం చదవడం, రాయడం వస్తే చాలు.. ఎటువంటి విద్యార్హతా లేకపోయినా.. 18 సంవత్సరాలు నిండి.. వివిధ కారణాలతో కళాశాలలకు వెళ్లలేని వారికి.. మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పిన వారికి.. ఉద్యోగులు, ప్రమోషన్లు పొందాలనుకునే వారు, గృహిణులు తదితర వర్గాల వారికి డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులను దూరవిద్య విధానంలో అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా ఏ విద్యార్హతా లేకుండా డిగ్రీ ఇవ్వకూడదని, పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారికే అడ్మిషన్లు ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఆ మేరకు దూరవిద్య కేంద్రం డిగ్రీ అడ్మిషన్లు కల్పిస్తోంది. ఈ సేవలను విస్తృతం చేసేందుకు 1972లో పలు జిల్లాల్లో స్టూడెంట్ సపోర్టు సెంటర్లు (స్టడీ సెంటర్లు) ఏర్పాటు చేసింది. వీటిద్వారా అనేక మంది పట్టభద్రులవుతున్నారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ, విద్యార్థుల ఆదరణ పొందిన దూరవిద్య కేంద్రం స్టడీ సెంటర్లు ఇక శాశ్వతంగా మూసివేయాలని ఏయూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, వివిధ జిల్లాలతో పాటు కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకూ నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లను ఇకపై పూర్తిగా మూసివేయనున్నారు.
ఏటా 6 వేలకు పైగా
అడ్మిషన్లు
ఏయూ దూరవిద్యలో చేరికకు ఏటా జూన్ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు. కాకినాడ, రాజమహేంద్రవరంలోని ఏయూ దూరవిద్య కేంద్రం స్టడీ సెంటర్ల ద్వారా వివిధ డిగ్రీ కోర్సులలో 6 వేల మంది, పీజీ కోర్సులలో 1,500 మంది ఏటా అడ్మిషన్లు పొందేవారు. వీరందరికీ అడ్మిషన్లు, వారాంతపు తరగతుల షెడ్యూల్, ఏ కళాశాలలో, ఏయే విభాగాల్లో కాంటాక్ట్ తరగతులు నిర్వహిస్తున్నారు, పరీక్ష ఫీజులు, దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రం తదితర వివరాలు అందించేందుకు ఆయా స్టడీ సెంటర్లలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండేవారు. వీరు పై పనులతో పాటు విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందించడం వంటి సేవలు కూడా అందించేవారు. విద్యార్థులకు సమయానికి స్టడీ మెటీరియల్ అందకపోతే సీనియర్ల పుస్తకాలు తీసుకుని అందజేసేవారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ అందుబాటులో ఉండేవారు. ఈ సిబ్బందిని విశాఖపట్నంలోని ఏయూ కేంద్రానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ స్టడీ సెంటర్లను మూసివేయడంతో ఇకపై వీరి సేవలు అందవని, డిగ్రీ పట్టా పొందడం కష్టమేనని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు
ఇక నుంచి డిగ్రీ లేదా పీజీ అడ్మిషన్ కావాలంటే ఏయూ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అడ్మిషన్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి ఆన్‌లైన్‌పై అవగాహన లేదు. అలాగే, ఏదైనా నెట్ సెంటర్ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినా.. ఫీజు చెల్లింపు, ఇతర విషయాల్లో తప్పిదాలు జరిగితే తాము నష్టపోతామని విద్యార్థులు వాపోతున్నారు. అయితే, వివిధ కోర్సులనే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తూండగా.. అడ్మిషన్ల వంటివి ఆన్‌లైన్‌లో జరపడం పెద్ద విషయమేమీ కాదన్నట్టుగా ఏయూ వ్యవహరిస్తోంది. వాస్తవానికి యూజీసీ నిబంధనలు సక్రమంగా పాటించడం ద్వారా ఏయూ దూరవిద్య కేంద్రం సర్టిఫికెట్లకు మంచి గుర్తింపే ఉంది. అటువంటిది ఇకపై ఆన్‌లైన్ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం ద్వారా అడ్మిషన్ల వేళ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన నుంచి తరగతులు, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వంటివన్నీ ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై దూరవిద్య కేంద్రం అధికారుల పర్యవేక్షణ ఉండదని అంటున్నారు. మరోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి ఆన్‌లైన్ కోర్సుకు కచ్చితంగా 20 శాతం పైగా విద్యార్థి చేతిరాత ద్వారా తరగతులు, ప్రాక్టికల్ పరీక్షలు చేపట్టాలి. మిగిలిన 80 శాతం ఆన్‌లైన్‌లో ఉండవచ్చు. కానీ, ఏయూ మాత్రం 100 శాతం ఆన్‌లైన్‌లోనే కొనసాగించే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. ఇకపై డిగ్రీ, పీజీ సబ్జెక్టులను అధ్యాపకుడు తరగతి గదిలో బోధించడం కాకుండా ఆరు నెలల ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సు తరహాలో మార్చేస్తారని చెబుతున్నారు.
ఈ నిర్ణయం సరికాదు
ఎంతో చరిత్ర కలిగిన ఏయూ దూరవిద్య కేంద్రం ద్వారా జిల్లాలో లక్షలాది మంది పట్టభద్రులయ్యారు. వీరిలో ఎంతో మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్టడీ సెంటర్‌కు సంబంధించిన అన్ని సేవలనూ ఆన్‌లైన్‌లో ఉంచి, ఈ కేంద్రాలను మూసివేయాలనేది సరైన నిర్ణయం కాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి.
– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
ఉద్యమిస్తాం
ఫీజు, అడ్మిషన్ల వంటివన్నీ ఏయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి సమాచారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, స్టడీ సెంటర్లు మూసివేతతో ఆవిధంగా సమాచారం ఇచ్చేవారుండరు. హెల్ప్‌లైన్ నంబర్లు పని చేయవు. ఏదైనా సమస్య వస్తే విశాఖపట్నంలోని వర్సిటీకి వెళ్లాలి. ఆన్‌లైన్ విధానం చూస్తూంటే ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపేలా ఉంది. స్టడీ సెంటర్లను తిరిగి కొనసాగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – పెంకే రవితేజ, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకుడు
దూరమైన విద్య
దూరమైన విద్య


